కర్నూలు: కర్ణాటక శాసనసభ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయం తాను చెప్పలేదని, అయితే మనకు అన్యాయం చేసినవారికి మాత్రం ఓటు వేయవద్దని చెప్పానని అన్నారు. తన కర్నూలు పర్యటనలో ఆయన ఆ విధంగా అన్నారు.

చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయి, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిజెపికి ఓటు వేయకూడదని పరోక్షంగా చెప్పారని అనుకోవచ్చు. జెడిఎస్ కు గానీ కాంగ్రెసుకు గానీ అది అనుకూలంగా మారే అవకాశం ఉంది. 

తెలుగు ఓటర్లు తమ వైపే ఉన్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతుండగా తెలుగు ముఖ్యమంత్రులు కేసిఆర్, చంద్రబాబు నాయుడు తమను గెలిపిస్తారని జెడిఎస్ నేత దేవెగౌడ అన్నారు. 

అదలా ఉంటే, బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలపై ఆయన ధ్వజమెత్తారు. అవినీతి కేసుల పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బిజెపి చూస్తోందని ఆయన అన్నారు. లేదంటే ఎన్నికల తర్వాత కలుపుకోవాలని చూస్తోందని అన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కేంద్రంపై పోరాటం చేస్తుంటే వైసిపి తనపై పోరాటం చేస్తోందని అన్నారు. బిజెపితో లాలూచీ పడిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.