శీతాకాలం కావడంతో దేశమంతా మంచుతో చల్లగా ఉన్నా ఏపీ రాజకీయాలు వింటర్ సీజన్‌లో హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారాన్ని ఇంకా మెుదలుపెట్టకపోయినప్పటికీ అధికార, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
తాడేపల్లి గూడెం: శీతాకాలం కావడంతో దేశమంతా మంచుతో చల్లగా ఉన్నా ఏపీ రాజకీయాలు వింటర్ సీజన్‌లో హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారాన్ని ఇంకా మెుదలుపెట్టకపోయినప్పటికీ అధికార, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
ఆయా పార్టీలో అసంతృప్తులు అయితే ఎప్పుడు గోడ దూకేద్దామా అంటూ గోపీల్లా ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అంచనాలు వెయ్యడం ఎవరితరం కావడం లేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తి చేసుకున్నా రాష్ట్రానికి ఒరిగిబెట్టింది ఏమీ లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు రాష్ట్రప్రయోజనాలు గాలికి వదిలేసి, సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శిస్తున్నాయి.
అధికార పార్టీ అలా విమర్శలు మూటకట్టుకుంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీకి ఫుల్ మైలేజ్ తీసుకువచ్చిందని ప్రచారం జరుగుతుంది.
అటు జనసేన పార్టీ సైతం తాము కూడా సిద్ధమంటూ ఎన్నికల సమరంలోకి దూకారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన జనసేన ఈసారి ఒంటరిగా బరిలోకి దిగి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చెప్తున్నారు. ఏపీలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పుకొచ్చారు.
పార్టీపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో పార్టీలోని కొందరు నేతలు పక్కదారి చూస్తున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీని వీడడానికి రెడీ అవుతున్నారని చెప్పుకొచ్చేశారు.
టీడీపీలో దాదాపు 15 నుండి 25 మంది సిట్టింగ్ నేతలు పార్టీ మారే అవకాశం ఉందని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు. అయితే మాణిక్యాలరావు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
