1995 నాటి సీఎంని చూస్తారని చంద్రబాబు ఎందుకంటున్నారు? అప్పుడు ఏం చేశారు? - ఎడిటర్స్ కామెంట్
చంద్రబాబు నాయుడు తన రెండో విడత అంటే 1999 నుంచి 2004 వరకు పాలనలో వివిధ పథకాలను అమలు చేశారు. అయితే, విద్యుత్ చార్జీలు పెంచడం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తదితర కారణాలు ఆయన పాలనపై వ్యతిరేకత పెంచాయి.
ఒక రాజు విజయం సాధించాలంటే.. ప్రజలు ఆయన్ను మెచ్చాలంటే.. రాజు పాలన ప్రజారంజకంగా ఉండాలంటే.. రాజు చుట్టు మంచి విమర్శకులు ఉండాలి – కౌటిల్యుడు.
ఈ కౌటిల్యుని వాక్కును కాసేపు పక్కన బెట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాక్కులకు వద్దాం. ఆయన నాలుగో సారి ముఖ్యమంత్రి అయి ఇప్పటి దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ కొద్ది రోజుల్లో బాబు చేసిన ఓ కామెంట్ నాకు బాగా నచ్చింది. ఆయన సరదాగా అన్నా.. దాని వెనుక చాలా అర్థం ఉంది.
మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, లోకేష్ మధ్య సరదా సంభాషణ జరిగింది. “ప్రారంభం కాబట్టి స్లోగా వెళ్తున్నా.. ఇక స్పీడ్ పెంచాలి. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలి” అన్నారు. అన్నట్లే కనీసం 24 గంటలు కూడా గడవక ముందే దాన్ని చేసి చూపించారు కూడా. వేల మంది వాలంటీర్లున్నా జగన్ పాలనలో ఒకటో తారీఖు పింఛన్ల పంపిణీ దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను పక్కన పెట్టి.. సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయించి సింగిల్ డేలో 95 శాతం వరకు పింఛన్ల పంపిణీని పూర్తి చేయించాడు. ఇది చూస్తే అర్జున్ ఒక్క రోజు సీఎం సినిమా 'ఒకే ఒక్కడు" గుర్తొచ్చింది.
95 సీఎం అంటే అధికారులను పరిగెత్తించడమేనా?
బాబు 1995 రోజులను, అప్పటి పాలనను ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారు? అంటే.. చంద్రబాబు జీవితంలో అత్యంత గోల్డెన్ పీరియడ్ అది. 1994 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయం, ఎన్టీఆర్ జీవితంలో, రాజకీయాల్లో లక్ష్మీపార్వతి ప్రభావం.. తర్వాత 1995 సెప్టెంబరు 1న బాబు సీఎం అవడం తెలిసిందే. ఈ సమయంలో బాబు చేసింది కరక్టే అని ఓ వర్గం.. కాదు బాబు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్థి వర్గం ఇఫ్పటికీ విమర్శలు కురిపిస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే 1995 బాబు అంటే వెంటనే గుర్తొచ్చేది అధికారులను పరుగులు పెట్టించడం.
చంద్రబాబు సీఎం కాదు.. CEO
1995, తర్వాత 1999లో వరుసగా రెండు దఫాలు సీఎం అయిన చంద్రబాబు నాయుడు.. అప్పట్లో సీఎంలాగా కాకుండా రాష్ట్రాన్ని ఓ సీఈవోలా పాలించారు. అప్పటివరకు కాంగ్రెస్ పాలన ఉండటం.. కాంగ్రెస్ పాలన అంతా ఢిల్లీ.. హైదరాబాద్‌లకే పరిమితం కావడంతో బాబు మొదటిసారిగా ప్రజల వద్దకు పాలన అంటూ తాను ప్రజల్లోకి వెళ్తూ అధికారులను, యంత్రాంగాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. తాను జిల్లా స్థాయి పర్యటనలు చేస్తే.. జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరీ పనులు చేయించారు. 1995లో బాబు వయసు 45 సంవత్సరాలు. కనీసం రోజులో 20 గంటలకు పైగానే పనిచేసేవారు. అలా ఆ పదేళ్లూ పాలనపై అంతలా దృష్టిపెట్టారు కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడూ అదే సూత్రం పాటించాలని బాబు అనుకుంటున్నారు.
జగన్‌ను ఓడించింది బాబును గెలిపించింది ఇదే...
చంద్రబాబు ప్రస్తుతం పార్టీ.. అధికార యంత్రాంగం మధ్య స్పష్టమైన హద్దులు నిర్దేశిస్తున్నారు. మొన్నా మధ్య ఓ మంత్రి భార్య పోలీసులపై హడావుడి చేస్తే.. అది మంచి పని కాదంటూ బాబు సదరు మంత్రికి గట్టిగా క్లాస్ పీకగా తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. వాస్తవానికి ఈ రకమైన ధోరణి వల్లే బాబు మళ్లీ సీఎం అవ్వగలిగారు. వాస్తవానికి 2019లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్‌కు పాదయాత్ర.. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంక్షేమ బ్రాండ్ వల్ల ఓట్లు పడటంతో జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. తాను తన తండ్రిలాగానే సంక్షేమంపై ఫోకస్ పెట్టి.. అదే మళ్లీ గెలిపిస్తుందనుకున్నారు. ప్రజల వ్యక్తిగత సంక్షేమంతో పోల్చితే విభజిత ఆంధ్రప్రదేశ్ కావాల్సింది సమ్మిళిత అభివృద్ధి. ఈ విషయంలో జగన్ బాగా వెనకబడ్డారు. దీంతో ప్రజల్లో మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే.. అభివృద్ధి, కార్యనిర్వహణ దక్షత, అధికారులను పరుగులు పెట్టించే బ్రాండ్ ఉన్న బాబు కావాలనుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీని కూటమికి కట్టబెట్టారు.
వ్యవస్థలు అతలాకుతలం
పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, అధికారులు వేరు, ప్రజా ప్రతినిధులు వేరు.. కానీ జగన్ ప్రభుత్వంలో వీటి మధ్య గీతలని పూర్తిగా చెరిపేశారు. అంతెందుకు.. చివరకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల పంపిణీలోనూ వాలంటీర్ల దబాయింపు, పెత్తనం చూస్తోంటే సగటు ఓటరుకు ఎప్పుడో ఓసారి కాలుద్ది. ఇఫ్పుడు జరిగింది అదే. అలాగే అధికార వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎమ్మెల్యేల వ్యవస్థను నడపించారు. స్థానికంగా MLA చెప్పిందే వేదమైంది. అధికారులు, వ్యవస్థ, విధానాలు, హక్కులు ఇలా అన్నీ నీరుగారిపోయాయి. రైతుకు ఓ ట్రాక్టర్ ఇవ్వాలన్నా, లేదా మరేదైనా పరికరం పంపిణీ చేయాలన్నా.. ఎమ్మెల్యే చెప్పాలన్న స్థాయిలో వైసీపీ హయంలో వ్యవస్థలు దిగజారిపోయాయి. ఈ ఎమ్మెల్యేలపై వచ్చిన అసంతృప్తి సెగలు చివరకు జగన్‌ను తగలబెట్టేశాయి. ప్రభుత్వ యంత్రాంగం నిజాయతీగా పని చేస్తూ.. పార్టీ ఆధిపత్యం లేకుండా చేస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. అది పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తోంది కూడా అదే. సీఎం ప్రజల మధ్య సోషల్ డిస్టెన్స్ జగన్ హయాంలో బాగా పెరిగిపోయింది. దీన్ని తగ్గించి.. ప్రజలకు అందుబాటులో ఉండే సీఎం అనే 95 ప్రిన్సిపల్‌ని ఫాలో అయితే చంద్రబాబుకు ప్రజల కష్టాలు, నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుస్తాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే.. ప్రజలు హ్యాపీగా ఉంటారు.. అది పార్టీకి పనికొస్తుంది.
1995 నుంచి 2004 వరకు బాబు మార్క్ పాలన
ఇందాక అనుకున్నట్లు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీ కేంద్రంగా పాలన నడిచేది. లేకుంటే హైదరాబాద్ కేంద్రంగా నడిచేది. ఈ ప్రాంతాలకు సామాన్యులు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో సీఎంలకు తెలిసేది కాదు. ఆ సమయంలోనే 1995లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన పేరిట ప్రజల్లోకి రావడం ప్రారంభించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మెరుగుపరచాల్సిన, అభివృద్ధి చేయాల్సిన అంశాలను లిస్టింగ్ చేయించి.. నేరుగా ఆయా జిల్లాలకు, నియోజకవర్గ కేంద్రాలకు వచ్చి అధికారులతో సమీక్షలు జరిపేవారు. ఓ సీఎం జిల్లాకు, నియోజవర్గానికి వచ్చి రివ్యూలు చేయడం వల్ల దాదాపు రాష్ట్రంలో ప్రతి అధికారీ పరుగులు పెట్టేవాడు. దీంతో పనులు ముందుకు నడిచేవి. ఇలాగే జన్మభూమి కమిటీల ఏర్పాటు, శ్రమ దానం వంటివి అమలు చేశారు. శ్రమదానం బాగా విజయవంతం అయింది. ఏ గ్రామంలో సమస్యలను ఆ గ్రామస్థులతోనే శ్రమదానంలో పరిష్కరించేవారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల విధులను తప్పక పాటించాల్సిందే. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే తనకు తెలియాల్సిందే అనేది బాబు పాలసీ. ఊర్లో పనిచేసే కార్యదర్శి మొదలు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వరకు అందరూ అలర్ట్‌గా ఉంటేనే గ్రామంలో ప్రజలు హ్యాపీగా ఉంటారని, పాలన సక్రమంగా అందుతుందని ఆయన భావన. అలా, అవినీతి రహిత ఉద్యోగులు, అధికారులనూ తయారు చేశారు చంద్రబాబు.
హైదరాబాద్ అభివృద్ధి...
ఇక హైదరాబాద్ అభివృద్ధిలోనూ చంద్రబాబు పాత్రను చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఐటీ సంస్థలను తీసుకురావడం, ఐటీ సంస్థల ఏర్పాటుకు వీలుగా ఇక్కడ మౌలికవసతులు, వనరులను అభివృద్ధి చేయడంతో బాబు హయాంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం.. ఐటీకి పరిశ్రమలకు కావాల్సిన ప్రోత్సాహకాలు కల్పించడంతో హైదరాబాద్ ఐటీ సిటీగా మారిపోయింది. మొత్తానికి 95 బాబు పనితీరు రిపీట్ అయితే జగన్ ప్రభుత్వంలో సోమరులుగా మారిన ఉద్యోగులు ఈసారి బాధ్యతతో మెలగాల్సి ఉంటుంది.
చంద్రబాబును ఆయన పనితీరే కొంప ముంచింది
చంద్రబాబు తన రెండో విడత అంటే 1999 నుంచి 2004 వరకు పాలనలో వివిధ పథకాలను అమలు చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల ఫలితంగా కరవు వంటివి ఆయన పాలనపై క్రమేణా వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. 2000 సంవత్సరం ఆగస్ట్‌లో పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద వామపక్షాలు, రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపడం, ఆ కాల్పులలో ముగ్గురు మరణించడం చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. టెలి కాన్ఫరెన్సులు, ప్రజల వద్దకే పాలన, ఆకస్మిక తనిఖీలు వంటివాటితో ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో వారి నుంచీ వ్యతిరేకత ఎక్కువైంది.
- వేణుగోపాల్ బొల్లంపల్లి | ఏసియానెట్ న్యూస్ తెలుగు ఎడిటర్ (Ex. BBC, Big Tv, Microsoft News, Eenadu)