గుంటూరు: వైసిపి ప్రభుత్వ ఏడాది పాలనపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని... అవినీతి, అక్రమాలతో విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఫల్యానికి కోర్టు చీవాట్లే నిదర్శనమని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికన వైసిపి ప్రభుత్వ పాలనపై చంద్రబాబు ధ్వజమెత్తారు. 

''ఒక్క ఛాన్స్ ఇమ్మని కాళ్ళావేళ్ళా పడి బతిమాలి అధికారంలోకి వచ్చినవారు గత ప్రభుత్వాలతో పోటీపడి మంచిపేరు తెచ్చుకోవాలి. కానీ పాలకులు ఆ అవకాశాన్ని చేజేతులా కాలరాశారు. అవినీతి, అరాచకాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు'' అని చంద్రబాబు మండిపడ్డారు.

''తొలి ఏడాదిలోనే ఇన్ని తప్పులా? ఇంత ప్రజా వ్యతిరేక పాలనా? ఇన్ని జీవోల రద్దా? ప్రభుత్వం కోర్టులతో ఇన్ని చివాట్లు తినడం గతంలో ఎన్నడూ లేదు. అన్ని రంగాల్లో అభివృద్ది రివర్స్. పేదల సంక్షేమంలో రద్దులు-కోతలు..నిధుల దారిమళ్లింపు, దుర్వినియోగం'' అని  విమర్శించారు.

read more  అంచనాకు మించి వెంకన్నను దర్శించుకున్న భక్తులు...: వైవి సుబ్బారెడ్డి

''రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారు. తెలుగుదేశం 5ఏళ్ల పాలనలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్ లు జరిగాయా? నేరగాళ్ల పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి వైసీపీ అరాచకాలే రుజువు. మోసగాళ్లు అధికారంలోకి వస్తే అన్నీ మోసాలే. దగాకోరుల రాజ్యంలో అన్నివర్గాల ప్రజలకు దగానే'' అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

''ఏడాదిలో 90% హామీలు నెరవేర్చారో.. 90% మోసాలకు పాల్పడ్డారో ప్రజల్లోకి వెళ్లి అడిగితే వాళ్లే చెబుతారు. 3 రాజధానుల బిల్లు, పిపిఏల రద్దు, బీసిల రిజర్వేషన్ల తగ్గింపు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, కౌన్సిల్ రద్దు బిల్లు, ఎలక్షన్ కమిషనర్ తొలగింపు''ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించారు.

''స్కీముల రద్దులు-పేర్లు మార్పు, జీవోల రద్దులు...అన్నీ తుగ్లక్ చర్యలే, అనాలోచిత అహంభావ నిర్ణయాలే, చేతగాని పాలన నిర్వాకాలే... ఇలా రాష్ట్రం ఎప్పుడైనా నవ్వుల పాలైందా? పాలకుల అవినీతి, అసమర్ధత రాష్ట్రానికి కీడు చేస్తుంటే అడ్డుకోవాల్సింది ప్రజలే''  అని సూచించారు.

read more   బెజవాడ గ్యాంగ్ వార్ లో బిటెక్, ఎంబిఎ యువకులు... నిందితుల పూర్తి వివరాలివే

''చేటుదాయక నిర్ణయాలను అడ్డుకునే బాధ్యత ప్రతిపక్షాలకే కాదు, ప్రజలకూ ఉంది. వివిధ మాధ్యమాల ద్వారా వైసీపీ పాలనా లోటుపాట్లను ఎత్తిచూపండి, దారితప్పిన ఈ ప్రభుత్వాన్ని చక్కదిద్దండి'' అంటూ వరుస ట్వీట్లతో వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు.