Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

సేవ్ నేషన్‌ పేరుతో  దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

Chandrababu Naidu To Meet Rahul Gandhi In Delhi Today
Author
Amaravathi, First Published Nov 1, 2018, 11:02 AM IST


అమరావతి: సేవ్ నేషన్‌ పేరుతో  దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారంలో  రెండోసారి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఢిల్లీ టూర్ చేపట్టారు. గురువారం నాడు  ఢిల్లీ వేదికగా బీజేపీయేతర పార్టీలను  ఏకతాటిపైకి తెచ్చేందుకు బాబు  ప్లాన్ చేస్తున్నారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేత ఇంట్లో జరిగే  విందు సమావేశం దేశంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురానున్నారు.

2014 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తును పెట్టుకొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ  బీజేపీతో పొత్తుతో టీడీపీ పోటీ చేసింది. ఏపీలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ఈ కూటమి 20 అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను  కైవసం చేసుకొంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌లో టీడీపీ భాగస్వామిగా చేరింది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  కేంద్రం ఇచ్చిన మాటను విస్మరించింది. దీంతో ఈ ఏడాది మార్చి మాసంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా   ఎన్డీఏ నుండి టీడీపీ వైదొలిగింది. అంతేకాదు  ఎన్డీఏపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.

ఆనాటి నుండి బీజేపీపై టీడీపీ ఒంటి కాలిపై  విమర్శలు గుప్పిస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్నారు. కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్  సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కూడ  బీజేపీయేతర పార్టీలు కీలకంగా వ్యవహరించాయి.  కర్ణాటక సీఎంగా హెచ్ డీ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసే సమయంలో బీజేపీయేతర పార్టీలన్నీ  బెంగుళూరు వేదికను పంచుకొన్నాయి.

బెంగుళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షురాలు సోనియాగాంధీ తో పాటు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కూడ ఈ వేదికను  పంచుకొన్నారు. 

సభ ముగిసిన సమయంలో  ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ఏనీ సీఎం చంద్రబాబునాయుడుభుజం తట్టారు. అంతేకాదు  డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో జరిగే  ఎన్నికల్లో కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌  ప్రజా కూటమి( మహాకూటమి) గా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి ఏర్పాటులో కూడ టీడీపీ కీలకంగా వ్యవహరించింది.

రానున్న రోజుల్లో కేంద్రంలో  బీజేపీయేతర  పార్టీలతో కూటమి ఏర్పాటులో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చక్రం తిప్పనున్నారు.  ఈ మేరకు  ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడ ఉండే అవకాశం లేకపోలేదు. గతంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్  ఏర్పాటులో చంద్రబాబునాయుడు,  అంతకుముందు ఎన్టీఆర్ పనిచేశారు. 

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్ తర్వాత  టీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా కూటములు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. యునైటెడ్ ఫ్రంట్ (యూఎఫ్), యూఎన్‌పీఏ కూటముల ఏర్పాటులో బాబు అప్పట్లో కీలకంగా వ్యవహరించారు.

ఆ తర్వాత పరిణామాల్లో బీజేపీకి దగ్గరై 1998 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కన్వీనర్‌గా కూడ  కొనసాగారు. ప్రస్తుతం బీజేపీతో చంద్రబాబునాయుడు సంబంధాలు చెడిపోయాయి. దీంతో  బీజేపీయేతర పార్టీలను ఏకతాటికిపైకి తీసుకురావడం వల్ల 2019 ఎన్నికల్లో కేంద్రంలో  బీజేపీయేతర పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాలని బాబు వ్యూహంగా కన్పిస్తోంది.


సేవ్ నేషన్ లక్ష్యంతో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  గురువారం నాడు బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే  ప్లాన్ చేస్తున్నారు.  ఈ విషయమై బుధవారం నాడు  టీడీపీ సీనియర్లు, అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబునాయుడు చర్చించారు. పలు జాతీయ పార్టీల నేతలతో గురువారం నాడు చంద్రబాబునాయుడు చర్చించనున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తో కూడ  చంద్రబాబునాయుడు  భేటీ కానున్నారు. 

రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలుస్తోందని  చంద్రబాబునాయుడు మంత్రుల దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం వల్ల ఏన్డీఏ అవలంభిస్తున్న విధానాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.   తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడ బాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో తాను సమావేశం కావాలని భావిస్తున్న విషయాన్ని చంద్రబాబునాయుడు  మంత్రుల సమావేశంలో  ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీలను కలుపుకొని పోవడంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో  కలిసి పనిచేయడం రాజకీయ అనివార్యతగా  చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వివరించాలని  చంద్రబాబునాయుడు మంత్రులను కోరారు.

ఢిల్లీలో తొలుత నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌లతో చంద్రబాబునాయుడు  వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత గురువారం నాడు మధ్యాహ్నం  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగే  విందు సమావేశానికి బాబు హాజరుకానున్నారు. 

ఈ సమావేశానికి హాజరయ్యే పలు పార్టీల నేతలతో బాబు చర్చించనున్నారు.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలోకి టీడీపీ చేరే అవకాశం ఉందని జోరుగా ఊహాగాహానాలు విన్పిస్తున్నాయి. 

 అయితే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేక కూటములు గతంలో పనిచేశాయని, కానీ, ప్రస్తుతం బీజేపీయేతర కూటమి కోసం పనిచేయాల్సిన రాజకీయ అనివార్యత ఏర్పడిందని బాబు  ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. గతంలో ఫ్రంట్‌ల,ను నడిపించిన అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు  విపక్షాలను ఏకం చేయడం  చాలా సులభమని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు
 

Follow Us:
Download App:
  • android
  • ios