అమరావతి: దేశంలో పరిపాలన ప్రమాదకర స్థాయిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయన్నారు. అన్ని రంగాల్లో అవినీతి పేరకుపోయిందన్నారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జాతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నానని అందుకు కలిసివచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళ్తానని తెలిపారు. 

గురువారం ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవబోతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సమావేశమై బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుపై చర్చిస్తానని తెలిపారు. రాహుల్ గాంధీతోపాటు శరద్ పవార్, శరద్ యాదవ్ లను కూడా కలవబోతున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే తాను ఢిల్లీలో పర్యటించానని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎల్ జేడీ అధినేత శరద్ యాదవ్ లను కలవబోతున్నట్లు తెలిపారు. అలాగే ఫరూక్ అబ్ధుల్లాతో కూడా భేటీ కానున్నట్లు తెలిపారు. 

బీఎస్పీ అధినేత్రి మాయావతితో తాను భేటీ అయ్యానని ఆమెతో రోజు టచ్ లో ఉంటున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటక సీఎం కుమారస్వామి,సీపీఎం, సీపీఐ నేతలు బృందాకారత్, రాజా, సీతారాం ఏచూరీలతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. 

దేశాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని పదవుల కోసం అసలు ఆశపడనని తెలిపారు. 1995లోనే తనకు ప్రధానిమంత్రిగా రెండు సార్లు అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదిలివేసినట్లు తెలిపారు. తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముఖ్యమని రాష్ట్రాన్ని దేశానికే ఒక నమూనాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అందుకు ఎలాంటి భయం లేదన్నారు. దేశం ఇబ్బందిలో ఉందని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో దేశ ప్రయోజనాల కోసం వెనకడుగు వెయ్యనని తేల్చిచెప్పారు.