తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి దారుణంగా ఓడిపోవడంతో డీలా పడ్డ ఏపీ తెలుగుదేశం శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. బుధవారం పార్టీ కీలకనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ప్రభావాల గురించి చర్చించారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూపించి వైసీపీ మైండ్ గేమ్ ఆడాలని చూస్తోందన్నారు. దీనిని ఎవరూ పట్టించుకోవద్దని, అధైర్యపడొద్దని.. తెలంగాణ కన్నా మనమే ఎక్కువ అభివృద్ధి చేశామన్నారు. టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేశామని.. ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని.. తెలంగాణ రాష్ట్ర సమితి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని.. కార్యకర్తలను చైతన్యపరుస్తూ...ఎన్నికలకు సన్నద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను ఇక పూర్తి సమయం పార్టీ కోసం కేటాయిస్తానని... మీరు ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు.

చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పుల మూటతో వచ్చి అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, సంక్షేమ పథకాల్లోనూ తెలంగాణ కన్నా మనం ఎక్కువ పథకాలు అమలు చేశామని ప్రజలు విశ్వసిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తేనే అభివృద్ది, సంక్షేమ పథకాలు సజావుగా సాగుతాయనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారన్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని ఎమ్మెల్యే బొల్లినేని రామారావును చంద్రబాబు అభినందించారు. ఉదయగిరిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన నియోజకవర్గాలు ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.