అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో నివసిస్తున్న ఇంటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి భారీగా నీరు చేరుతోంది. 

ఈ క్రమంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద రెండున్నర లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

దీంతో కృష్ణా కరకట్ట వెంబడి వున్న నివాసాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో భాగంగానే ఉండవల్లిలో చంద్రబాబు నివాసం సహా గెస్ట్‌హౌస్‌లు, గృహాలకు నోటీసులిచ్చారు.

2019 ఆగష్టు 17వ తేదీన కూడ ఇలానే కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ఇంటిని ఖాళీ చేయాలని చంద్రబాబునాయుడుకు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబునాయుడు ఇంట్లోకి వరద నీరు వచ్చింది. ఆ సమయంలో బాబు నివాసంలోని మెట్ల వరకు వరద నీరు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కూడ కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో వరద నీరు ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరద నీరు బాబు ఇంటిని ముంచెత్తే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. 

కరకట్ట వెంట ఉన్న ఇతర నివాసాలకు కూడ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.
ఏ క్షణంలోనైనా వరద నీరు ఇంట్లోకి చేరే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని చంద్రబాబుకు అధికారులు నోటీసులిచ్చారు.