గుంటూరు: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్స్, సేవలందిస్తున్న వైద్య సిబ్బంది అగ్నిప్రమాదం బారిన పడినట్లు తెలియగానే తీవ్ర ఆందోళనకు గురయ్యానని... 11 మంది మృత్యువాత పడటంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యానని అన్నారు.

 

ఈ అగ్నిప్రమాదం ఘటనపై సోషల్ మీడియా వేదినక స్పందించారు చంద్రబాబు. ''ఈ రోజు ఉదయం విజయవాడ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాను.  తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను మరియు గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. 

read more   కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయవిదారకం: పవన్ కల్యాణ్ ఆవేదన

విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. 

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది మృత్యువాతపడగా చాలామంది తీవ్ర అస్వస్ధతకు గురయినట్లు తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ  అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు.  ఇప్పటికే ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపి గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, సీఎం జగన్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిశులు స్పందించారు. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సాయం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది.