కడప: కడప పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. కడప పార్లమెంట్ నియోజకవర్గంలోని వైసీపీ ఆధిక్యతను తగ్గిస్తే ఈ సెగ్మెంట్‌లో టీడీపీ విజయం  సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కడప జిల్లాలో వైసీపీ ఆధిక్యతను దెబ్బతీసేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి ఆధిక్యతను దెబ్బతీసేందుకు జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాన్ని  టీడీపీ టార్గెట్ చేసింది.

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అత్యధికంగా పార్లమెంట్ సీటుకు ఓట్లు వచ్చేలా చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. అందుకే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై బాబు ప్లాన్ చేస్తున్నారు.

జమ్మలమడుగు సీటు నుండి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని బాబు వీరిద్దరికి తేల్చి చెప్పారు. రామ సుబ్బారెడ్డి అసెంబ్లీకే పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ స్థానం నుండి  మూడు దఫాలుగా తాను విజయం సాధించినందున తనకే అవకాశం ఇవ్వాలని మంత్రి ఆదినారాయణరెడ్డి కోరుతున్నారు.

జమ్మలమడుగు నుండి పోటీకి దూరంగా ఉండే వారికి కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేయించాలని  చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. జమ్మలమడుగు నుండి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తే ఆదినారాయణరెడ్డిని  కడప ఎంపీగా పోటీ చేసేందుకు  అవకాశం కల్పించనున్నారు. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుండి పోటీ చేస్తే రామసుబ్బారెడ్డిని కడప పార్లమెంట్ స్థానం నుండి  చంద్రబాబునాయుడు యోచనగా ఉంది.

అయితే జమ్మలమడుగును వదిలేందుకు ఈ ఇద్దరు నేతలు కూడ ఆసక్తిగా లేరు. ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరితే జమ్మలమడుగు సెగ్మెంట్‌లో  టీడీపీకి అత్యధిక మెజారిటీ లభించే అవకాశం ఉందని బాబు ప్లాన్ చేస్తున్నారు.

కడప ఎంపీ స్థానాన్ని గెలుచుకొనేందుకే బాబు ప్లాన్ చేస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ సెగ్మంట్ నుండి లభించే మెజారిటీ కారణంగానే వైసీపీ కడప స్థానంలో విజయం సాధిస్తోందని  టీడీపీ విశ్వసిస్తోంది. ఈ తరుణంలో జమ్మలమడుగు నుండి  కూడ టీడీపీకి భారీ మెజారిటీ వచ్చేందుకే  బాబు కసరత్తు నిర్వహిస్తున్నారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలతో  ఈ నెల 7వ తేదీన చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లో  ఎవరిని పోటీ చేయించాలనే  విషయమై  స్పష్టత వచ్చే అవకాశం ఉంది.