అమరావతి: ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని అమలు హామీలుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోరాటాన్నిమరింత ఉధృతం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. చివరి పార్లమెంట్ సమావేశాలు కావడంతో కేంద్రంతో అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మెుంచి చెయ్యిచూపించిందని ఆరోపిస్తూ ఢిల్లీ కేంద్రంగా టీడీపీ పలు ఆందోళనలు నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టారు. అంతేకాదు అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. 

తాజాగా మరోసారి జాతీయ స్థాయిలో తమ ఉద్యమాన్ని తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రోజు నిరసన దీక్ష చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

అయితే తేదీ మాత్రం ఖరారు చెయ్యాల్సి ఉంది. మరోవైపు జనవరి 30న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలపక్ష సమావేశానికి ఏయే పార్టీలను ఆహ్వానించాలి, పార్టీలను ఆహ్వానించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. 

ఇకపోతే మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ ఈనెల 29నరౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి జరిగిన నష్టావలతోపాటు వాటిని ఎదుర్కోవడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి జనసేన, తెలుగుదేశం పార్టీ హాజరుకానుంది. 

ఆ మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. మరి చంద్రబాబు నాయుడు ఏ పార్టీలను సమావేశానికి పిలుస్తారు అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.