జగన్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ అందరికీ కింజారపు అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు నాయుడు అన్నారు.

 శ్రీకాకుళం: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన జైలు నుండి విడుదలయ్యారు. బయటకు వచ్చిన అచ్చెన్నాయుడికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... జగన్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ అందరికీ కింజారపు అచ్చెన్నాయుడు ఆదర్శంగా నిలిచారని అన్నారు. అక్రమ కేసులతో బలహీనవర్గాలకు చెందిన నేతలను వేధిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు. 

జగన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ నేతలను ఎదుర్కోలేక పోలీసు వ్యవస్థను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ అక్రమ కేసులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో పోరాడే నేతలే చిరస్థాయిగా నిలిచిపోతారని అచ్చెన్నాయుడుతో చంద్రబాబు అన్నారు.

read more నిమ్మగడ్డ తీరుకు నిరసన.. ఎన్నికలు బహిష్కరించిన కంపసముద్రం

స్వగ్రామం నిమ్మాడలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అప్పన్నను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకొన్నారనే కేసులో అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఫిబ్రవరి రెండో తేదీన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.

అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సోమవారం నాడు బెయిల్ మంజూరు చేస్తూ సోంపేట అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అచ్చెన్నాయుడితో పాటు మరో 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో అచ్చెన్న బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం ఉదయం జైలు నుండి అచ్చెన్నాయుడు విడుదలయ్యారు.