విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల అరెస్ట్‌లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల అరెస్ట్‌లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గం అని మండిపడ్డారు. పవన్ బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం అని అన్నారు. 

విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్‌ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. 

Scroll to load tweet…

ఇక, పవన్ కల్యాణ్ శనివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలోనే.. నగరంలోని నిర్వహించిన విశాఖ గర్జన ముగించుకుని వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు ఎయిర్‌పోర్టుకు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ మంత్రుల వాహనాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే జనసేన కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. 

‘‘విశాఖపట్నంలో పోలీసుల ప్రవర్తన చాలా దురదృష్టకరం. జనసేన ఎల్లప్పుడూ ఏపీ పోలీసు బలగాలను ఎంతో గౌరవిస్తుంది. మా పార్టీ నాయకులను అరెస్టు చేయడం అనవసరం. డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని మా నేతలను విడుదల చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. లేదంటే నేను పోలీసు స్టేషన్‌కు వచ్చి వారికి సంఘీభావం తెలియజేస్తాను’’ అని పవన్ ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉంటే.. ఆదివారం విశాఖలో మీడిమాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు కురిపించారు. పోలీసులు ఓ వ్యక్తి కింద పనిచేస్తున్నారని.. వారంటే గౌరవం లేని వ్యక్తికి సెల్యూట్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై వారికి విశ్వాసం లేదని గతంలో వైసీపీ నేతలు చెప్పారని అన్నారు.

‘‘మేం ఏమైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నామా’’ అని పవన్ ప్రశ్నించారు. పోలీసుల పట్ల గౌరవంతోనే తమ పార్టీ సంయమనంతో వ్యవహరించిందని పవన్ అన్నారు. ఇబ్బంది పెట్టాలనుకున్న వారే పోలీసులను రెచ్చగొట్టారని ఆరోపించారు. “పోలీసులు రాష్ట్రాన్ని నడపడం లేదు. శాంతిభద్రతలను కాపాడటమే వారి కర్తవ్యం. జనసేన పోరాటం విధానాలు, నిర్ణయాలు తీసుకునే వారిపైనే తప్ప పోలీసులతో కాదు’’ అని చెప్పారు. 

ప్రజల సమస్యలపై మాట్లాడే వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోలేక అధికార పార్టీ భయపడుతోందని అన్నారు. వైసీపీ గూండాల బెదిరింపులకు తాను భయపడబోనని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మాజీ సైనికుల భూములను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆక్రమించారని ఆరోపించారు. ఆయనకు ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రేమ ఉంటే ఆ భూములను ఖాళీ చేయాలని అన్నారు.

మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీ నిర్వహించడంపై పవన్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీ ‘విశాఖ గర్జన’ లాంటి ర్యాలీని ఎలా నిర్వహిస్తుందో అర్థం కావడం లేదని.. అధికారాలన్నీ తన చేతుల్లోనే కేంద్రీకరించుకున్న వ్యక్తి అధికార వికేంద్రీకరణపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

మూడు నెలల క్రితమే ఉత్తరాంధ్రలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు జనసేన అధినేత తెలిపారు. ‘‘వైఎస్‌ఆర్‌సిపి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకోవడానికి చాలా ముందే మా కార్యక్రమం నిర్ణయించబడింది. వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి అంతరాయం కలిగించే ఉద్దేశం మాకు లేదు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే జనసేన జనవాణి కార్యక్రమం చేపట్టింది’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.