గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన చంద్రబాబు తాజాగా గోదావరి పెన్నా నదులు అనుసంధానం శ్రీకారం చుట్టారు. తొలి దశ పనులకు నకరికల్లు వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. 

అలాగే పేరేచర్ల-కొండమోడు రోడ్డు విస్తరణ పనులకు కూడా చంద్రవబాబు శంకుస్థాపన చేశారు. మరోవైపు సత్తెనపల్లి, రాజుపాలెం బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలవనరుల  అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 35శాతం తక్కువ వర్షపాతం నమోదవుతున్నా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో 2కోట్ల ఎకరాలను సస్యాశ్యామలం చేసేందుకు తమ ప్రభుత్వం 62 ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులు ఒక యజ్ఞంగా చేపట్టామని అందులో భాగంగా  17 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు.  

మరో ఏడు ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలంటే రెండు లక్షల కోట్లరూపాయలు అవసరమని చెప్పారు. ఒక్క గోదావరి పెన్నా నది అనుసంధానానికే 90వేల కోట్లరూపాయలు ఖర్చు అవుతందన్నారు. 

ఎంతో చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ అడ్డు తగులుతుందని చంద్రబాబు ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డుపడ్డారని తెలిపారు. అలాగే పులివెందుల నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. 

పులివెందుల నియోజకవర్గంలో తాము ఎన్నడూ గెలవలేదని అయినా నీరందించిన ఘన తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. గుంటూరు జిల్లాకు సాగునీరందించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాకు తాగునీటి కోసం ఇప్పటికే 1400కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. జిల్లాలోని ప్రతీ గ్రామానికి సాగు, తాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

మరోవైపు అద్భుతమైన రీతిలో రాజధానిని నిర్మిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ఐదు మహానగరాల్లో ఒకటిగా ఉంటుందని అమరావతిని తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు తరలివస్తారన్నారు. 

అలాగే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు.కరువు నుంచి రైతులను ఆదుకునేందుకు ఇన్ పుట్ సబ్సీడీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.