మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయానికి వ్యతిరేకంగా... నూతన ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ దాడులకు చంద్రబాబు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా... మాజీ సీఎం తీసుకున్న నిర్ణయానికి జగన్ తిలోదకాలు వదిలారు. ఏపీలో సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్‌ లేకుండా ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అధికారంలేని సీబీఐకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణను జగన్‌ సర్కారు రద్దు చేయబోతోంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏరాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. 

ఆయా కేసులకు సంబంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో కన్సెంట్‌ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ కక్ష సాధించేందుకు వినియోగిస్తోందన్న ఆరోపణలతో గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కన్సెంట్‌ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో, సీబీఐ ప్రవేశానికి పాత మార్గాన్నే చూపబోతోంది.