పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యత వుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. పొత్తులు వున్నందున టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. మంచివారు, పార్టీకి ఉపయోగపడతారు అనుకుంటేనే తీసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. పొత్తుల నేపథ్యంలో ఇరు పార్టీల్లోనూ ఎప్పటి నుంచో వున్న నేతలు త్యాగాలకు సిద్ధం కావాల్సి వుంటుంది. ఇది కొన్ని చోట్ల రెండు పార్టీల నేతల్లో అసంతృప్తులకు కారణమైంది. తమకు టికెట్ కేటాయించని నేపథ్యంలో తీవ్ర పరిణామాలు తప్పవని..అధిష్టానాలకు వారు హెచ్చరికలు పంపుతున్నారు. కూటమిలోకి బీజేపీని కూడా తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ ప్రస్తుతానికి సానుకూలంగానే వున్న నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి పొత్తులు, సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది. 

ఇప్పటికే త్యాగాలకు సిద్ధం కావాలని నేతలకు చంద్రబాబు సూచించారు. తాజాగా పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యత వుంటుందని టీడీపీ చీఫ్ వెల్లడించారు. శుక్రవారం పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులు వున్నందున టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. జగన్‌ తీరుతో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరుతామని వస్తున్నారని.. మంచివారు, పార్టీకి ఉపయోగపడతారు అనుకుంటేనే తీసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఈ తరహా చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రా .. కదలిరా సభలు ముగిశాక ప్రజాచైతన్య యాత్రను ప్రారంభిస్తానని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలని.. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తోందని, ప్రతి నియోజకవర్గంలో ఈ సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారనే భావన ప్రతి ఒక్కరిలోనూ వుందన్నారు.