అమరావతి:రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో చోటు చేసుకొన్న  ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. 

బుధవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన ఘటనలో నిందితులను శిక్షించాలని ఆందోళన చేసిన భక్తులు జైల్లో ఉన్నారన్నారు. 

ఈ ఘటనకు పాల్పడిన అరాచకశక్తులు యధేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరారు.రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో చోటు చేసుకొన్న ఘటనలపై సీఎం జగన్ నోరు మెదపాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో దేవాదాయ భూములు ఆక్రమణకు గురౌతున్నట్టుగా ఆయన చెప్పారు. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీటీడీ డైరీని తగ్గించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 11 ఆలయాలను కూల్చేశారని ఆయన ఆరోపించారు.

తిరుమలలో అన్యమత ప్రచారం పెరిగిందన్నారు. శారదాపీఠం మహాసభలకు శ్రీవారి సొమ్మును ఖర్చు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఆలయాల్లో పనిచేసే అర్చకులపై వేధింపులు పెరిగాయన్నారు. 

also read:బీజేపీకి చెక్: ఏపీలో రూటు మార్చిన చంద్రబాబు

దుర్గగుడిలో వెండి రథంపై సింహాల ప్రతిమలు ఏమయ్యాయన్నారు.ఈ విషయం వెలుగు చూసి ఒక్క రోజు దాటుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇదే నియోజకవర్గంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి ఈ విషయం ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. దుర్గగుడిలో సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై ఈవోపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

తిరుమలలో సంప్రదాయాలను మార్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలం ఆలయంలో కూడ అనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న ఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆలయాల్లో తప్పుడు  కార్యక్రమాలు చేయడానికి సీసీ కెమెరాలను తొలగించారని ఆయన విమర్శించారు.