అమరావతి: సదావర్తి భూముల విషయంలో ఏ విచారణకైనా తాను సిద్దమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఏపీ అసెంబ్లీలో సదావర్తి భూములపై జరిగిన చర్చలో  ఏపీ మాజీ సీఎం  చంద్రబాబునాయుడు స్పందించారు.

సదావర్తి భూములపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తారు.ఈ విషయమై చంద్రబాబునాయుడు స్పందించారు.  చాలా ఏళ్లుగా  ఈ భూములను తమిళనాడు ప్రభుత్వం కూడ తమకే చెందుతాయని వాదిస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

ఇప్పటికే చాలా భూముల్లో సినిమా హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినట్టుగా చెప్పారు. కేవలం 83 ఎకరాల భూమి మాత్రమే మిగిలిందన్నారు. మిగిలిన భూమికి సంబంధించిన టైటిల్ డీడ్స్‌ కానీ, పట్టాలు గానీ లేవని బాబు తెలిపారు.  టైటిల్ డీడ్స్, పట్టాలు ఉంటే సభకు తెలపాలని  చంద్రబాబు మంత్రిని కోరారు.

తమ హాయంలో  ఈ భూముల వేలం పాట పాడిన సమయంలో  చోటు చేసుకొన్న అంశాలను చంద్రబాబునాయుడు సభలో ప్రస్తావించారు.  ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడానికి వైసీపీ నేతలే కారణమని ఆయన చెప్పారు.

ఈ భూములు తమకే చెందుతాయని తమిళనాడు ప్రభుత్వం కూడ సుప్రీంకోర్టులో వాదించాయన్నారు. అసలు భూములు ఎవరివో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా చంద్రబాబు సభలో చెప్పారు.

వైసీపీ నేతల వల్లే  సదావర్తి భూముల విషయంలో  రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కూడ రాకుండా పోయాయని చెప్పారు.మరో వైపు అసలు భూములకే ఎసరొచ్చిందన్నారు. ఈ విషయమై వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన విచారణ వేసినా తాము సిద్దమేనన్నారు.