ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో పలువురు అంతర్జాతీయ నిపుణులు రుజువు చేస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని కోరారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ పార్టీ కీలకనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ పోరాటం వల్లే ఈవీఎంలకు వీవీప్యాట్ రశీదులు వచ్చాయన్నారు. అయితే ప్రింట్ తర్వాత రశీదుపై రంగు తక్కువ ఉండటం వల్ల వెంటనే కరిగిపోతుందన్నారు. వీవీ ప్యాట్ కూడా 100 నియోజకవర్గాల్లో అమలు లేదని చెప్పారు.

అలాగే ఈవీఎంల వినియోగం, ట్యాంపరింగ్ వంటి అంశాలపై జాతీయస్థాయిలో చర్చిస్తున్నామని సీఎం తెలిపారు.  22 పార్టీలకు చెందిన ప్రతినిధులతో త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని వెల్లడించారు.

120 దేశాల్లో అసలు ఈవీఎంలను వినియోగించడం లేదని, 20 దేశాల్లోనే వినియోగం ఉందన్నారు. అలాగే కేబినెట్‌ భేటీలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి శ్రేణులకు సూచించారు.

కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం, ఇతరులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.  పెన్షన్ల రెట్టింపుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లను ముందుగా చెల్లిస్తామన్నారు.  మిగిలిన వారికి హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఆటోలపై జీవితకాల పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు.