రాబోయే ఎన్నికల్లో ముగ్గురు మోడీలతో పోరాటం చేయాలని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇవాళ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది ఎన్నికల ఏడాదని, అత్యంత కీలకమైన సమయమని చంద్రబాబు అన్నారు.

విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులను నేటీ వరకు కేంద్రం చెల్లించలేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గెలిస్తే తన అసమర్థత బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని, అలాగే కేసుల మాఫీ కోసం జగన్‌కు అధికారం కావాలని సీఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి అన్యాయం చేసిన వారితో జగన్ జత కట్టారని.. మోడీ, జగన్, కేసీఆర్ ఏపీపై పగబట్టారన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించలేదని, అలాగే పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రకటనలను ఏపీలో ఇస్తారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.  

నేనేదో అక్రోశంలో ఉన్నాడని మోడీ అంటున్నారని, గుజరాత్‌ను ఏపీ ఎక్కడ మించిపోతుందోననే ఆక్రోశం మోడీదని, అందువల్లే ఏపీకి నిధులు ఇవ్వకుండా అక్కసు చూపుతున్నారన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే మోడీ రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.