కడప: కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా అన్ని రంగాల్లో ఏపీని అగ్రగామిగా తీసుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాయలంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేంద్రం వైఖరిపై ధ్వజమెత్తారు. 

కేంద్రప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెుండి చెయ్యి చూపించిందని ఏ అంశంలోనూ న్యాయం చెయ్యకుండా ఏపీ పట్ల వివక్ష చూపిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదన్నారు. సహకరించకపోగా ఇబ్బందులు సృష్టించారన్నారు. 

ఒక్క రూపాయి లేకుండా అమరావతికి భూములు ఇచ్చారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాగే కడప ఉక్కు కర్మాగారానికి కూడా అడ్డంపెట్టారని ఆరోపించారు. రామాయణ పోర్టు కూడా డవలప్ చేసుకుంటున్నట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అసెంబ్లీని తీసుకున్నామని తెలిపారు. ఆరు టవర్స్, గూగుల్ ఆఫీస్ కంటే మిన్నగా సెక్రటేరియట్ ను నిర్మించుకుంటున్నామని అలాగే ఒక బ్యూటిఫుల్ ఐకానిక్ హైకోర్టును కూడా నిర్మించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

నదులు అనుసంధానం పూర్తి అయితే రాష్ట్రంలో ఏజిల్లాలో కరువు ఉండదన్నారు. వర్షపాతం ప్రతీ సంవత్సరం ఎక్కువగా నమోదవుతుందన్నారు. అయినా వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎక్కడా నష్టం వాటిల్లలేదన్నారు. గోదావరి పెన్నా, వంశధార పెన్నా నదుల అనుసంధానం ద్వారా ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు.

 జీడీపీలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. 

 కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగా తయారైందన్నారు. ఈ నేపథ్యంలో కాలయాపన చెయ్యకుండా ఈ నెల 27న కడపలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయ్యనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

విద్యా సంస్థలను కేంద్రం మంజూరు చేసింది కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిందని, కాంపౌండ్ వాల్స్ నిర్మించామని కానీ కేంద్రం మాత్రం నిధులు ఇవ్వకుండా ఆటంకం కలిగిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. 

వీటితోపాటు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ను తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని ప్రైవేట్ యూనివర్శిటీలు ఏపీ వైపు చూస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.