అమరావతి: రాష్ట్రంలో 95 లక్షల మంది చెల్లెమ్మలకు పసుపు-కుంకుమ పథకం ద్వారా రూ.20వేలు చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో మాట్లాడిన చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం ద్వారా రూ.21 వేల కోట్ల రూపాయలను మహిళలు లబ్ధి పొందారని చంద్రబాబు తెలిపారు. 

వృద్ధులకు పెద్ద కొడుకుగా ఉంటానని తాను హామీ ఇచ్చానని ఇచ్చినట్లుగానే రూ.200 నుంచి రూ.2000 వరకు పింఛన్ ఇస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. పింఛన్ల వల్ల రూ.14వేల కోట్లు భారం అవుతున్నా ప్రభుత్వం వెనుకడుగు వెయ్యడం లేదన్నారు. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి రూ.44వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. శ్రీశైలం జలాలను రాయలసీమకు తరలించామన్నారు. రాయలసీమను సశ్యశ్యామలం చేసిన ఘనత తమదేనన్నారు. 

రాళ్లసీమను రతనాల సీమగా మార్చినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాకుండా అనేక పథకాలను అమలు చేశామని చెప్పుకొచ్చారు. ఉద్యానవన పంటలను పండించే రైతుల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. 

ఈ పథకం ద్వారా లక్ష 40వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం రూ.384కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. పంట సంజీవని ద్వారా భూగర్భజలాలను పెంచామని తెలిపారు. రైన్ గన్ లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. 

24వేల ట్రాక్టర్లను రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంటికి రెండు ఎల్ ఈడీ బల్బులను ఇచ్చినట్లు తెలిపారు. అగ్రవర్ణాలలోని పేదల పెళ్లిల్లకు ఆర్థిక సహాయాన్ని అందజెయ్యనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.