Asianet News TeluguAsianet News Telugu

నా నియోజకవర్గానికి రాకుండా పారిపోవాలా?.. తప్పుడు చట్టంతో జీవో ఇచ్చారు: వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

కుప్పం తన సొంత నియోజకవర్గం అని.. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గత నెలలోనే తాను కుప్పం వస్తానని చెప్పానని.. డీజీపీకి సమాచారం అందజేశామని తెలిపారు.

Chandrababu naidu comments after police stop him in kuppam Constituency
Author
First Published Jan 4, 2023, 5:58 PM IST

కుప్పం తన సొంత నియోజకవర్గం అని.. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గత నెలలోనే తాను కుప్పం వస్తానని చెప్పానని.. డీజీపీకి సమాచారం అందజేశామని తెలిపారు. ఈ నెల 2వ తేదీన ఈ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చిందన్నారు. రోడ్డు షోలు పెట్టకూడదని నిబంధనలు తెచ్చారని  మండిపడ్డారు. తన రోడ్ ‌షోను అడ్డుకునేందుకు కొత్త జీవో ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ దయాదాక్షిణ్యాలతో సభలు పెట్టుకునేలా ఉత్తర్వులు ఇచ్చారని విమర్శించారు. 

మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గం బయలుదేరిన చంద్రబాబును పోలీసులు పెద్దూరు వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వాహనం నుంచి కిందకుదిగారు. ఈ క్రమంలోనే  చంద్రబాబుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

ఆ ఉద్రిక్తల మధ్యే చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జీవో వచ్చిన మరుసటి రోజే సీఎం జగన్ కూడా సభ నిర్వహించారు. జగన్ సభ కోసం స్కూళ్లకు సెలవు ఇచ్చారు. వైసీపీ సభలకు రాని జనాలకు పెన్షన్లు కట్ చేస్తున్నారు. సభకు తరలించేందుకు జనాలపై ఒత్తిడి తెస్తున్నారు’’ అని అన్నారు. తమను మాత్రం రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. తాను అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడా? అని ప్రశ్నించారు. జగన్ పని అయిపోయిందని..  ఈ ప్రభుత్వానికి వణుకుపుట్టిందని అన్నారు. 

Also Read: చంద్రబాబును పెద్దూరు వద్ద అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత..

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి మాట్లాడే స్వేచ్ఛ, తిరిగే స్వేచ్చ ఉందని అన్నారు. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడాలా? అని ప్రశ్నించారు. కుప్పంలో నియోజకవర్గంలో తన పర్యటను అడ్డుకున్నారంటే.. తన ఇంటికి తనను రాకుండా చేయడమేనని అన్నారు. తన ప్రజలతోని తనను మాట్లాడనివ్వరా? అని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడంపై స్పష్టంగా రాతపూర్వక వివరణ కోరానని చెప్పారు. పోలీసుల చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. 

ఏ చట్ట ప్రకారం జీవో నెంబర్ 1  తీసుకోచ్చారని ప్రశ్నించారు. 1860 చట్టం మద్రాసు ప్రెసిడెన్సీకి వర్తించదని 46 సెక్షన్ ఉందని అన్నారు. ‘‘అదే  చట్టం 46 సెక్షన్‌లో చాలా స్పష్టంగా  ఇప్పటికే ఒక చట్టం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉందని చెప్పారు. ఆ చట్ట ప్రకారం వాళ్లు నడుచుకుంటున్నారు.. అవసరమైతే దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చని తెలిపారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి.. ఈ చట్టాన్ని అమలు చేసుకోవచ్చని చాలా స్పష్టంగా చెప్పారు’’ అని  చంద్రబాబు చెప్పారు. ఆ చట్టాన్ని ఎప్పుడూ అడాప్ట్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఆ జీవోకు చట్టబద్దత లేవని అన్నారు. 

‘‘నాకు పోలీసులు లెటర్ ఇస్తే.. దాని ప్రకారం క్రమశిక్షణ గల పౌరుడిగా నడుచుకుంటాను. ముందుగా బాబాయిని ఎవరూ చంపారో తేల్చండి. నేను ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటాను. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ తెస్తారా?, నియంత కావాలని అనుకుంటున్నావా.. జగన్ రెడ్డీ.. ’’అని మండిపడ్డారు. తనను ఎన్నిరకాలుగా ఇబ్బందిపెట్టినా పారిపోయే రకం కాదని అన్నారు. ‘‘సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి’’ అని అన్నారు. కుప్పంలో ఎవరిని కదిలించినా వారి గుండెల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. 

అదే సమయంలో అక్కడికి పోలీసులు లేఖ తీసుకురాగా.. పోలీసులు గతంలో ఇచ్చిన లేఖనే మళ్లీ ఇచ్చారని చంద్రబాబు నాయుడు అన్నారు. తాను కుప్పంకు రావొద్దా? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గం కూడా రాకుండా పారిపోవాలా? అని ప్రశ్నించారు. ‘‘నాకు మైక్ ఎందుకు ఇవ్వరు?, నా రోడ్ షోకు ఎందుకు పరిష్మన్ ఇవ్వరు?,  నా బాధ చెబుతున్నాను. ఆవేదన చెబుతున్నాను. నా ప్రజలతో నన్ను మాట్లాడనివ్వరా?.. గతంలో ఇదే విధంగా మా పార్టీ నేతలను జైలులో పెట్టారు. నన్ను కూడా జైలులో పెట్టండి. రాష్ట్రానికే బేడీలు వేయండి’’ అని మండిపడ్డారు. తాను ఏం రోడ్లు తవ్వడం లేదన్నారు. వైసీపీకి ఒక్క రూల్.. టీడీపీ మరోక రూలా? అని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులపై తనపై పోరాటం కాదన్నారు. ‘‘సైకో సీఎం ఒక్క రూల్.. నాకు ఇంకో రూలా?’’ అని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులపై లాఠీ చార్జీని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. నా వాహన రప్పించే వరకు ఇక్కడే ఉంటానని చెప్పారు. 

జగన్ కంటే బ్రిటీష్ వాళ్లే నయం అని అన్నారు. బిట్రీష్ వాళ్లు కూడా గాంధీజీని ఉద్యమాలు చేయనిచ్చారని అన్నారు. తమను అణచివేయాలని  చూస్తే.. వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. తన ప్రచార రథం తెచ్చే వరకు ఇదే గ్రామంలో తాను పాదయాత్రగా వెళ్తానని.. ఆ తర్వాత మైక్ రాకుంటే అక్కడే ధర్నా చేస్తానని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios