అమరావతి: తెలంగాణ సీఎం సమీక్షలు నిర్వహిస్తే ఎవరూ కూడ నోరు తెరవడం లేదని.. తాను సమీక్ష నిర్వహిస్తే మాత్రం నానా యాగీ చేస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 

గురువారం నాడు ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడ సరిగా నిర్వహించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సంఘం పరిధిలోనే ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు మాత్రమే పని చేయాలన్నారు. 

ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని.. అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో తాము నంబర్ 1గా నిలిచామన్నారు. 

అలాంటిది ఇప్పుడు ఈసీ రూపంలో... అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో... అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దీనిని కూడా సమర్థంగా తిప్పికొడదామని చంద్రబాబు పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన బూత్ కన్వీనర్లు, పార్టీ శ్రేణుల వివరాలు ఇవ్వాలని  చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.  పార్టీ కోసం సీబీఎన్ ఆర్మీ సైనికుడిగా పనిచేసిందని  చంద్రబాబునాయుడు ప్రశంసించారు. సెలవులు పెట్టి కూడ సీబీఎన్ ఆర్మీ పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులు కూడ పార్టీ కోసం  పనిచేసిన విషయాన్ని బాబు ప్రస్తావించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు... తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నిoపుతోందన్నారు. తన పోరాటాన్ని ఎవరు ఎలా ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి టీడీపీ వస్తోందని ఆయన చెప్పారు.  ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదన్నారు. దుర్మార్గుడు అధికారంలోకి రావటానికి... ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశాడని చంద్రబాబునాయుడు పరోక్షంగా జగన్‌పై విమర్శలు చేశారు. 

 మే 1 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తి కావడంతో ప్రత్యర్ధుల కుట్రలు ముగియలేదని.. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసీపీ, బీజేపీ కుట్రలు కొనసాగుతాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్ధుల ఓట్లలో తేడాలు ఉన్నాయని.. కౌంటింగ్ పూర్తయ్యేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.