Asianet News TeluguAsianet News Telugu

ఒక ఫ్యామిలీ.. ఒకటే టికెట్, జేసీ బ్రదర్స్‌ని చంద్రబాబు ఈ మాటతో కట్టేయగలరా...?

ఈసారి జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జేసీ కుటుంబం పాత్రపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభాకర్ రెడ్డి కూడా అన్న బాటలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక కొన్నాళ్లు కొనసాగుతారా అన్నది తెలియాల్సి వుంది. కానీ ఈ లోపలే తాడిపత్రి టికెట్‌ను జేసీ బ్రదర్స్ పట్టుబట్టి సాధించుకున్నట్లుగా తెలుస్తోంది.

chandrababu naidu allocate ticket to jc asmith reddy for tadipatri assembly ksp
Author
First Published Jan 28, 2024, 3:27 PM IST

జేసీ బ్రదర్స్ .. ఏ పార్టీలో వున్నా రాజకీయంగా తమ పట్టు నిలుపుకుంటూ వుంటారు. కాంగ్రెస్‌లో రాజకీయాలను శాసించిన ఈ ఫ్యామిలీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరింది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలు విజయం సాధించారు. అలాగే జిల్లాకే చెందిన కొందరు అనుచరులకు కూడా టికెట్లు, కీలక పదవులు ఇప్పించుకున్నారు జేసీ బ్రదర్స్. అయితే 2019 ఎన్నికలు వచ్చే నాటికి పరిస్ధితులు మారిపోయాయి. ఈ ఇద్దరు నేతలు తప్పుకుని తమ వారసులు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలను బరిలోకి దించారు. 

అయితే ఆ సమయంలో వైసీపీ ప్రభంజనంతో జేసీ సోదరులిద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ రాజకీయాలకు దూరంగా వుండగా.. ఈ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి ఒక్కరే యాక్టీవ్‌గా వున్నారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం జేసీ కుటుంబం తమ పట్టును నిలుపుకోవడంతో పాటు పార్టీ పరువును కూడా కాపాడింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో ఆయన నిత్యం ప్రజల్లోనే వుంటున్నారు. 

ఇదిలావుండగా.. ఈసారి జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జేసీ కుటుంబం పాత్రపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభాకర్ రెడ్డి కూడా అన్న బాటలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక కొన్నాళ్లు కొనసాగుతారా అన్నది తెలియాల్సి వుంది. కానీ ఈ లోపలే తాడిపత్రి టికెట్‌ను జేసీ బ్రదర్స్ పట్టుబట్టి సాధించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జేసీ బ్రదర్స్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాడపత్రి టికెట్ అస్మిత్ రెడ్డికి ఇచ్చేందుకు ఓకే చెప్పగా.. పవన్ రెడ్డి కోరిన కళ్యాణ దుర్గం మాత్రం కుదరదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అనంతపురం నుంచి ఎంపీ బరిలో నిలబెట్టాలని దివాకర్ రెడ్డి భావించినా.. ఎందుకో మనసు మార్చుకుని కళ్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆయన ప్లాన్ మార్చారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. తాడిపత్రిలో ఓడిపోయిన అస్మిత్ రెడ్డి... తన తండ్రి ఎలాగూ మున్సిపల్ ఛైర్మన్ కావడంతో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ పవన్ రెడ్డి మాత్రం ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. క్షేత్ర స్థాయిలో వ్యవహారాలపై రిపోర్టు తెప్పించుకున్న చంద్రబాబు .. జేసీ బ్రదర్స్ ప్రాబల్యాన్ని తాడిపత్రికి పరిమితం చేయాలని ఫిక్స్ అయ్యారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 8 చోట్ల తన మద్ధతుదారులకే టికెట్లు ఇప్పించుకోవాలని జేసీ బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఏ పార్టీలో వున్నా సహజంగా జరిగేదే. కానీ చంద్రబాబు వీరికి ఆదిలోనే చెక్ పెట్టాలని భావిస్తున్నారు. పైగా.. చాలా నియోజకవర్గాలోని మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలతో జేసీ బ్రదర్స్‌కు పడదు. తమపై పెత్తనం చేస్తామంటే ఒప్పుకునేది లేదని కరాఖండీగా చెప్పేశారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జేసీ కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. అది కూడా అస్మిత్ రెడ్డి  అభ్యర్ధిత్వాన్ని మాత్రమే ఖరారు చేశారు. మరి పవన్ రెడ్డి పరిస్ధితి ఏంటీ, జేసీ బ్రదర్స్ తమ పిల్లల కోసం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తిగా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios