తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంచలన ఆరోపణలు చేశారు. కడప జైలులో ఉన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంచలన ఆరోపణలు చేశారు. కడప జైలులో ఉన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. శనివారం విజయవాడ పటమటలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను అనంతపురం జైలులో హత్యకు గురైన సమయంలో జైలర్‌గా ఉన్న వరుణ్ రెడ్డినే ఇప్పుడు కడప జైలర్‌గా నియమించడంపై చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వరుణ్ రెడ్డిని సస్పెండ్ చేసి, లూప్ లైన్‌లో పెట్టి ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేశారని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా అతడు కనిపించలేదని తెలిపారు. 

‘ఇప్పుడు సీఎం జగన్ రెడ్డి అతనిపై సస్పెషన్ ఎత్తివేశారని అన్నారు. కడప జైలుకు తీసుకొచ్చారు. అక్కడున్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను చంపేస్తారా..?. అతడు ఉండాల్సింది జైలర్‌గా కాదని.. జైలులో’ అని చంద్రబాబు అన్నారు. కడప జైలర్‌గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని చెప్పారు. 

ఈ రోజు తమ పార్టీ కార్యకర్తలు బాధపడినట్లే.. రేపు అనేది ఒకటుందని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అర్ధరాత్రిని అశోక్‌బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదని అన్నారు. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చని చెప్పారు. కానీ పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని.. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారని అన్నారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్ రెడ్డి ఆటలు సాగనివ్వమని చెప్పారు.