అమరావతి: ప్రస్తుతం తాను ఉంటున్న ఉండవల్లిలోని నివాసాన్ని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖాళీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు ఆ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

చంద్రబాబు అమరావతిలో మరో ఇంటి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇప్పటికే చాలా వరకు కూల్చి వేశారు. దాన్ని కూల్చివేసిన తర్వాత చంద్రబాబు ఉంటున్న భవనాన్ని కూల్చే వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. పరోక్షంగా దాన్ని కూడా కూల్చివేయక తప్పదని చెబుతున్నారు. అ రకంగా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలనే సంకేతాలు ఇస్తున్నారు. గుంటూరుకు, విజయవాడకు త్వరగా చేరుకునే విధంగా తన నివాసం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.  

రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెం గ్రామానికి చెందిన టీడీపి నేతలు కొందరు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబుకు స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ స్థితిలో జగన్ ప్రభుత్వం దాన్ని కూల్చివేయడానికి వెంటనే పూనుకుంటుందా, కోర్టు తీర్పు కోసం వేచి చూస్తుందా అనేది తెలియడం లేదు. కూల్చివేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా జగన్ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదని అంటున్నారు.