Asianet News TeluguAsianet News Telugu

టేకోవర్: చంద్రబాబు చేతుల్లోకి ఏపి కాంగ్రెస్

చంద్రబాబు ఎపి కాంగ్రెసును టేకోవర్ చేయబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. రాహుల్, చంద్రబాబు మధ్య ఖమ్మం వేదికగా జరిగిన చర్చల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒకే వేదికను పంచుకుని పరస్పరం ప్రశంసలు గుప్పించుకున్నారని అంటున్నారు.

Chandrababu May take over AP Congress
Author
Hyderabad, First Published Nov 29, 2018, 3:54 PM IST

హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మధ్య దోస్తీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుపై నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు ఆయన చెప్పారు. దీంతో ఎపి కాంగ్రెసు వ్యవహారాలను కూడా చంద్రబాబు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు ఎపి కాంగ్రెసును టేకోవర్ చేయబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. రాహుల్, చంద్రబాబు మధ్య ఖమ్మం వేదికగా జరిగిన చర్చల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒకే వేదికను పంచుకుని పరస్పరం ప్రశంసలు గుప్పించుకున్నారని అంటున్నారు. 

చంద్రబాబు ప్రతిభా పాటవాలను తాను 2004లోనే గుర్తించి ప్రశంసించానని రాహుల్ గాంధీ అంటే, దేశానికి సమర్థ నాయకత్వాన్ని అందించే సత్తా రాహుల్ గాంధీకే ఉందని చంద్రబాబు కొనియాడారు. దీన్ని బట్టి, చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయావసరాలు, రాహుల్ గాంధీకి జాతీయ రాజకీయావసరాలు తీర్చుకోవడానికి అనుగుణంగా వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో తాను 13 సీట్లకే పరిమితమయ్యాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను తనకే వదిలేయాలని చంద్రబాబు రాహుల్ గాంధీని కోరినట్లు చెబుతున్నారు. పెద్ద భాగస్వామిగా తనకు వదిలేయడం న్యాయమని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఇటువంటి అవగాహన జాతీయ స్థాయిలో జరిగినట్లు చెబుతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పెద్దదయితే, ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి పొత్తుల వ్యవహారాలను, సీట్ల వ్యవహారాలను అప్పగించాలనేది ఆ అవగాహనగా చెబుతున్నారు. 

ఆ అవగాహనలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెసుకు అత్యధిక సీట్లు దక్కేందుకు వీలుగా చంద్రబాబు తన తెలంగాణ తమ్ముళ్లను సిద్ధం చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసుకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ సీట్లు ఇవ్వాలి, కాంగ్రెసు నుంచి ఎవరిని బరిలోకి దింపాలి వంటి విషయాలన్నీ చంద్రబాబు చేతిలోకి వెళ్తాయని అర్థం చేసుకోవచ్చు. 

తెలంగాణలో చంద్రబాబు అవసరాలను కాంగ్రెసులో చేరిన రేవంత్ రెడ్డి తీరుస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో తిరిగి కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుస్తారని అంటున్నారు. అదే సమయంలో ఇరు పార్టీల ఉమ్మడి శత్రువు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి రెండు పార్టీలు ఎపిలో ఏకమవుతున్నాయని అనుకోవచ్చు. 

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందనేది అర్థమవుతోంది. అయితే, దీనికి కాంగ్రెసు నాయకులు ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. రెండు పార్టీల మధ్య పొత్తును వ్యతిరేకిస్తూ సి. రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ వంటి కొందరు నేతలు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఎపిలో పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయమని ఎపి కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. 

ఎపిలో కాంగ్రెసుకు శాసనసభలో ఒక్క సీటు కూడా లేదు. ఈ స్థితిలో పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీతో కలిసి శాసనసభలోకి అడుగు పెట్టే వీలుంటుందనే ఉద్దేశంతో పొత్తుకు అంగీకరించే అవకాశాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ నేతలను చంద్రబాబు త్యాగాలకు సిద్ధం చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ తమ పార్టీ నాయకులను త్యాగాలకు సిద్ధం చేస్తారని అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు లోకసభ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి లోకసభ సీట్ల పంపకంలో చంద్రబాబు కాంగ్రెసుకు సమాన వాటా ఇవ్వవచ్చు. ఏమైనా, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయనేది అర్థమవుతోంది.

సంబంధిత వార్త

ఏపీలో చంద్రబాబుతో పొత్తుపై తేల్చేసిన రాహుల్

Follow Us:
Download App:
  • android
  • ios