Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో చంద్రబాబుతో పొత్తుపై తేల్చేసిన రాహుల్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ వద్ద ఈ పొత్తు విషయాన్ని తీసుకురాగా..బాల్ చంద్రబాబు కోర్టులో విసిరేసినట్లు సమాచారం.

rahul gave clarity on alliance with tdp
Author
Hyderabad, First Published Nov 29, 2018, 10:21 AM IST

ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీ సీఏం చంద్రబాబు నిర్ణయానికే వదిలేశారు. కేంద్రంలో బీజేపీని అధికారంలో నుంచి కిందకు దింపేందుకు బీజేపీ యేతర శక్తులను ఒక్కటి చేసేందుకు చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో కూడా టీడీపీ- కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి.

అయితే.. ఏపీలో కూడా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందనే వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ వద్ద ఈ పొత్తు విషయాన్ని తీసుకురాగా..బాల్ చంద్రబాబు కోర్టులో విసిరేసినట్లు సమాచారం.

‘రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీచేస్తే మీకు లాభమనుకుంటే అలాగే వెళ్దాం. ఎవరికి వారు విడిగా పోటీ చేయడం మంచిదనుకుంటే అదే చేద్దాం’ అని రాహుల్ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరో పది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటి ఫలితాలు కూడా వెంటనే విడుదలౌతాయి.

కాబట్టి..  తెలంగాణలో  పరిస్థితిని చూసి.. అప్పుడు ఏపీలో పొత్తు గురించి అధికారికంగా ప్రకటన చేద్దామని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘ప్రస్తుతం ఎవరేమనుకుంటున్నా అవి ఊహాగానాలే. తగిన సమయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం జాతీయ కూటమి పటిష్ఠ నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారు’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios