జగన్ అనుభవం అదే, పవన్ ను నాపైకి వదిలారు: చంద్రబాబు

Chandrababu lashes out at YS Jagan
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు దొంగలెక్కలు రాసుకునే అనుభవం తప్ప రాజకీయానుభవం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు దొంగలెక్కలు రాసుకునే అనుభవం తప్ప రాజకీయానుభవం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అటువంటివారిని గెలిపిస్తే రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం కాదు, ఏకంగా అమ్మేస్తారని ఆయన అన్నారు. ఇప్పటికే కేసుల భయంతో జగన్‌ కేంద్రం చేతి లో కీలుబొమ్మలా ఆడుతున్నారని ఆయన అన్నారు.

విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ నుంచి బిజెపికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ తనపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. కన్నా వైసీపీకి సొంత మైకు, బీజేపీకి మాత్రం అద్దెమైకు అని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన జనసేనను బీజేపీ తనపైకి వదిలిందని ఆయన అన్నారు.

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద పోలవరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కాలని ప్రయత్నం చేశారు. అవేమీ పారలేదని అన్నారు. తాను గడ్కరీకే హెచ్చరికలు చేశానని, రాష్ట్రానికి రావలసిన హక్కును సాధించుకునేవరకు వదిలిపెట్టేది లేదని, తెలుగువారి సత్తా చూపుతామని స్పష్టంచేశానని అన్నారు.

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని దోనేపూడిలో గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. రచ్చబండ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో  మొత్తం 25 మంది ఎంపీలనూ గెలిపించుకుంటే కేంద్రంలో చక్రం తిప్పగలమని, మన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల దేశానికి ఒరిగిందేమీలేదని, బ్యాంకులు దివాలా తీశాయని, జీఎస్టీ పేరుతో చిరు వ్యాపారులపై వేధింపులు పెరిగాయని ఆయన అన్నారు. వారి సంస్కరణలు ఇంత దారుణంగా ఉంటాయని ప్రజలు ఊహించి ఉండరని చంద్రబాబు అన్నారు.

loader