చంద్రబాబు కుప్పం టూర్: కేసులు నమోదు చేసిన పోలీసులు
చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనను పురస్కరించుకొని చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కల్గించడం, దాడి చేశారని కేసులు పెట్టారు.
చిత్తూరు: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గడ్డూరు, 121 పెద్దూరు, గొల్లపల్లిలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు కేసులు పెట్టారు. పోలీసులపై దాడి,పోలీసులవిధులను అడ్డుకోవడం,అనుమతి లేకుండా ప్రచార రథం తిప్పడంపై పోలీసులు కేసులు పెట్టారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబునాయుడు బుధవారం నాడు కుప్పం పర్యటనకు వచ్చారు. బెంగుళూరు నుండి చంద్రబాబునాయుడు శాంతిపురం మండలంలో పర్యటించేందుకు నిన్న సాయంత్రం వచ్చారు. చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు గడ్డూరు, క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. కర్ణాటకకు సరిహద్దులోని 121 పెద్దూరు, గొల్లపల్లి వద్ద కూడా టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఏర్పాటు చేసిన స్టేజీలను పోలీసులు తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో ప్రకారంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం చేసింది. ఏదైనా సభ నిర్వహించాలంటే ఎంతమంది సభకు వస్తారు, ఎంట్రీ , ఎగ్జిట్ ఎన్ని ఉన్నాయనే విషయాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఈ రకమైన సమాచారం ఇవ్వకపోవడంతో రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఈ విషయమై పోలీసులతో చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి తనను రాకుండా ఎలా అడ్డుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్ 28న కందుకూరులో చంద్రబాబు రోడ్ షో లో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ నెల 1వ తేదీన గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రోడ్లపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. విపక్ష పార్టీల సభలు, ర్యాలీలక్ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.