చిత్తూరు రైతు నాగేశ్వర్ రావు కి సోనూసూద్ ట్రాక్టర్ బహుమానంగా ఇచ్చిన తరువాత, ఆ రైతు కూతుళ్ళ విద్య బాధ్యతలను పూర్తిగా తాను చూసుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇద్దరు అమ్మాయిలకు తమ  ఎన్టీఆర్  ట్రస్ట్ విద్యాలయాల నుంచి అడ్మిషన్ లెటర్స్ ని పంపించారు. 

నాగేశ్వరరావు కూతుళ్లు వెన్నెల, చందనలకు అడ్మిషన్ ఇచ్చినందుకు చంద్రబాబుకు, ట్రాక్టర్ ఇచ్చినందుకు సోనూసూద్ కి రైతు నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 

చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్‌రాజ్‌పల్లెకు చెందినవాడు నాగేశ్వర్ రావు. తల్లిదండ్రుల నుండి వచ్చిన రెండెకరాల మెట్ట భూమి, ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పక్కా ఇల్లు ఇతని ఆస్తిపాస్తులు.  

మదనపల్లెలో టీ కొట్టు నిర్వహించుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తుండేవాడు.. కానీ లాక్ డౌన్ పుణ్యమాని టీ కొట్టు మూతబడింది. దానితో సొంతఊరికి చేరుకొని ఉన్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుందామనుకున్నాడు. 

ట్రాక్టర్ కిరాయికి తీసుకొని దున్నించడానికి అద్దె ఎక్కువగా ఉండడంతో, ఆ డబ్బును ఖర్చు పెట్టడం ఇష్టం లేక కూతుళ్లు ఆయనకు సహాయం చేసారు. నాగేశ్వరరావు ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా అరక లాగుతుండగా, నాగేశ్వరరావు పొలాన్ని దున్నాడు. ఆయన భార్య వెనుక విత్తనాలు చల్లుతున్న విడెన్ వైరల్ గా మారింది. 

 ఈ విషయం వైరల్ గా మారి, విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు. అది సోనూసూద్ కంటపడింది. 

సోనూసూద్ ఆ వీడియో చూసి చలించి వారికి ట్రాక్టర్ అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. సాయంత్రానికి ట్రాక్టర్ వారి వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. ట్రాక్టర్ గురించి సోనూసూద్ ప్రకటించిన వెంటనే చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఆయన అభినందించిన విషయాన్నీ సోనూసూద్ కూడా ధృవీకరిస్తూ ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసి, త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సర్ అని రాసుకొచ్చాడు. 

చంద్రబాబు సైతం రైతు నాగేశ్వరరావు ఇద్దరు కూతుళ్ళకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. వారి చదువు బాధ్యతలన్నీ తాను చూసుకుంటానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆయన వారికి తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాట్లను చేసారు.