అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియంతలా పాలన సాగించాలని చూస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటూ వైఎస్ జగన్  సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపాలని చంద్రబాబుు పార్టీ ఎంపీలకు సూచించారు.

ఆదివారం సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానిలు పాల్గొన్నారు. 

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న వైఖరిపై సమావేశంలో చర్చించారు. తన ఇష్టానుసారంగా జగన్ పాలనను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు పార్టీ  నేతలకు చెప్పారు. ప్రజలు ఏం కోరుకొంటున్నారనే విషయాన్ని వదిలేసి తన ఇష్టానుసారంగా పనిచేయడం సరైంది కాదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

టీడీపీని వీడీ కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు బీజేపీలో చేరుతుున్న విషయాన్ని ఎంపీలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పార్టీని వీడే వారు వీడుతుంటారు, పార్టీలో కొత్తవారిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలను కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాదని చంద్రబాబునాయుడు చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడ బీజేపీ ఎదగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేసేలా కృషి చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను కోరారు.

పార్లమెంట్ సమావేశాల్లో ముగ్గురు ఎంపీలు అనుసరిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో స్వంత నియోజకవర్గాలకే పరిమితం కాకుండా గుంటూరు పార్టీ కార్యాలయంలో కూడ అందుబాటులో ఉండాలని చంద్రబాబునాయుడు ఎంపీలను ఆదేశించారు.