తెరపైకి మళ్లీ ఓటుకు నోటు కేసు: బొత్స ఫైర్, చంద్రబాబుకు చిక్కులు

Chandrababu in trouble over cash for vote
Highlights

అతి కీలకమైన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరిపారు.

హైదరాబాద్: అతి కీలకమైన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరిపారు. చాలా కాలంగా దాని ఊసే లేకుండా పోయింది. బిజెపి కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు దాడికి దిగిన ఈ సమయంలో కేసిఆర్ ఆ కేసును మరోసారి తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది.

ఆ రకంగా కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు, ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులకు ఓ అస్త్రాన్ని అందించినట్లయింది. ఓటుకు నోటు  కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను బయటపెట్టాలని బిజెపి నాయకుడు ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో తెలంగాణకు చెందిన అప్పటి టీడీపి శాసనసభ్యుడు, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. చంద్రబాబు పేరును కూడా తెలంగాణ ఎసిబి తన చార్జిషీట్ లో పలుమార్లు ప్రస్తావించింది. 

ఓటుకు నోటు కేసుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓటుకు నోటు కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఓటుకు నోటు కేసుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యేపై కేసు పెట్టి చేతులు దులిపేసుకున్నారని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు కేసుపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. లేకపోతే చంద్రబాబు, కేసిఆర్ కలిసి తెలుగు ప్రజలకు అన్యాయం చేసి నష్టం చేసినవారవుతారని అన్నారు.

ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు చేయడంలో దిట్ట అని ఆయన అన్నారు.  నీతిమంతుడ్ని అంటున్న చంద్రబాబు నిజస్వరూపం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వరుస అత్యాచారాలపై బొత్స చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు చట్టంపై గౌరవం ఉంటే అలాంటి సంఘటనలు జరగవని ఆయన అన్నారు. 

loader