చంద్రబాబుకు చిక్కులు: జగన్ చేతికి కేసీఆర్ అస్త్రం, సాక్షి దుమారం

Chandrababu in trouble: KCR helps Jagan with Cash for vote
Highlights

న్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నోటుకు ఓటు కేసును తిరగదోడుతున్నారనే అభిప్రాయం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఉపకరిస్తోంది. 

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నోటుకు ఓటు కేసును తిరగదోడుతున్నారనే అభిప్రాయం ఉంది. అయితే, అది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఉపకరిస్తోంది. జగన్ చేతికి కేసీఆర్ అస్త్రం అందించారని అంటున్నారు. 

కేసీఆర్ ఓటుకు నోటుపై సమీక్ష చేయడంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రోజా, పార్థసారథి, అంబటి రాంబాబు వంటి నేతలు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు దీక్షల పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

వైసిపి నేతల విమర్శలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారని అభిప్రాయం ఉంది. కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని, సుప్రీంకోర్టు కూడా ఆ విషయం తేల్చి చెప్పిందని మాత్రమే చెబుతున్నారు తప్ప ధీటుగా ఎదుర్కునేందుకు తగిన ఆయుధ సంపత్తిని వారు సమకూర్చుకోలేకపోయారని అంటున్నారు. 

అదలా ఉంటే, వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా వరుసగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటుకు నోటు కేసును ఆసరా తీసుకుని వార్తాకథనాలను ప్రచురిస్తూ వస్తోంది. చంద్రబాబును ఎ1 నిందితుడిగా చేరుస్తారంటూ కథనాలు ఇస్తోంది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేరుస్తూ తెలంగాణ ఎసిబి చార్జిషిట్ దాఖలు చేయనుందని రాస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షల రూపాయలు అందజేస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ డబ్బును సమకూర్చినవాళ్లలో ఎపి మంత్రితో పాటు టీఆర్ఎస్ లో చేరిన టీడిపి ఎమ్మెల్యే ప్రమేయాన్ని గుర్తించినట్లు సాక్షి మీడియా రాసింది. 

స్టీఫెన్ సన్ తో మాట్లాడింది చంద్రబాబేనని హైదరాబాదు, చండీఘడ్ ఫోరెన్సిక్ విభాగాలు తేల్చినట్లు కూడా రాసింది. సాక్షి మీడియా వార్తాకథనాల్లో ఏ మేరకు వాస్తవం ఉందనేది చెప్పడం కష్టమే అయినప్పటికీ చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. మొత్తం మీద, కీలకమైన సమయంలో చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి కేసిఆర్ సమీక్ష పనికి వచ్చిందని, అది జగన్ కు అస్త్రంగా మారిందని మాత్రం చెబుతున్నారు.

loader