కడప: ఏపీలో రాబోయే అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కొ నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ ఎన్నికలకు ముందు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసే చంద్రబాబు ఈసారి అలా కాకుండా ఒక్కొనియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 

అంతేకాదు అభ్యర్థులను ప్రకటించడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు బాబు. కాపు, బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా తొలుత వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. తాజాగా రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడును ఎంపిక చేశారు. 

చెంగలరాయుడు అభ్యర్థిత్వం ఖరారు వెనుక చాలానే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆ ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు భత్యాల చెంగలరాయుడును తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని దరి చేర్చుకోవాలన్న చంద్రబాబు ప్లాన్ లో ఒక భాగంగానే చెంగలరాయుడును ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇకపోతే చెంగలరాయుడు చంద్రబాబుకు చిన్న నాటి స్నేహితుడు కావడం విశేషం. 

కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించిన చెంగలరాయుడు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే సైకిలెక్కేశారు. మూడున్నరేళ్ల క్రితం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువాకప్పుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ, అందరిని కలుపుకుపోయే వ్యక్తిగా చెంగలరాయుడుకు మంచి పేరుంది. 

మరోవైపు ఈ నియోజకవర్గంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, రెడ్ బస్ వ్యవస్థాపకుడు చరణ్ రాజు సైతం ఆశలు పెట్టుకున్నారు. మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో చరణ్ రాజు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. 

చరణ్ రాజుకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆశీస్సులు ఉన్నాయి. గత కొద్దిరోజులుగా రాజంపేటలో చరణ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు సీఎం రమేష్ కు అత్యంత సన్నిహితుడిగా మారాడు. దీంతో చరణ్ నే రాజంపేట అభ్యర్థిగా ప్రకటిస్తారన్నప్రచారం కూడా జరిగింది. 

అటు చరణ్ సైతం పోటీకి సై అంటూ ప్రకటించారు. ఇటీవల చంద్రబాబు నాయుడును సైతం కలిశారు. ఇకపోతే మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ వీడటంతో ఆ టిక్కెట్ తనదేనని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సంబరపడ్డారు. 

గత కొద్దిరోజులుగా రాజంపేటలో జరుగుతున్న పంచాయితీని ఆసక్తిగా గమనించిన శ్రీనివాసుల రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డితో చేతులు కలిపి మేడాను పొమ్మనకుండా పొగబెట్టారంటూ వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు తానా అధ్యక్షుడు వేమన సతీష్ సైతం తన పేరు కూడా పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. 

శ్రీనివాసుల రెడ్డిని కాదని చరణ్ రాజు, వేమన సతీష్ లకు టిక్కెట్ పార్టీలో వర్గపోరు మెుదలయ్యే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన భత్యాల చెంగలరాయుడును ఎంపిక చేశారు. 

వివాదాస్పద రహితుడుగా పేరున్న చెంగలరాయుడు అభ్యర్థిత్వాన్ని అయితే అంతా ఆమోదిస్తారని అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయని కూడా చంద్రబాబు ప్లాన్ వేశారు. అయితే  రాజంపేట నియోజకవర్గం విషయంలో చంద్రబాబు పాచిక పారుతుందా...టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు సహకరిస్తారా.....అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.