ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో చంద్రబాబు అమరావతిలోని సీఎం నివాసగృహంలో విడివిడిగా చర్చలు జరిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచనలు, సలహాలు చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలోని పదిహేను మంది టీడీపీ నేతలకు బుధవారం సీఎం ను కలవాలన్న సమాచారం అందింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డిలకు సీఎం ఫేషీ నుంచి పిలుపొచ్చింది. ఈ ముగ్గురు నేతలతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు.

ముందుగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు..వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో వారిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతలను వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. గెలవడం మాత్రమే కాదని..ఎక్కువ మెజార్టీ సాధించేలా కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.