విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరికి ఏ మాత్రం గౌరవం దక్కడం లేదు. చంద్రబాబు కోసం కాకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టీడీపిలో చేరుతున్నట్లు ఆమె గతంలో చెప్పారు. టీడీపిలో చేరిన తర్వాత ఆమెను పట్టించుకునే వారు లేకుండా పోయారు. తాజాగా పరిణామం ఆ విషయాన్ని తెలియజేస్తోంది.

వాస్తవంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించడం, వారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం సంప్రదాయం. ప్రతిపక్ష పార్టీకి చెందినా కూడా ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యే అధ్యక్షతనే కార్యక్రమం జరగాలి.

అయితే, అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మాత్రం ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం విషయంలో ఆ గౌరవం దక్కడం లేదు. ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం విషయంలోఆమెను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధికారిక ఆహ్వాన పత్రికను అచ్చు వేశారు. 

ఈ నెల 9వ తేదీ గురువారం పాడేరు జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. 

ఆమె అధ్యక్షతన కార్యక్రమం జరగాల్సి ఉండగా, ఆహ్వాన పత్రికలో జిల్లా ఎమ్మెల్యేల జాబితాలో మాత్రమే ఆమెకు చోటు కల్పించారు. ప్రోటోకాల్ అమలు కోసం ఆరు నెలలుగా ఆమె పోరాటం చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.