ఏపీలో మరో రెండు కొత్త పథకాలు ప్రారంభానికి సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నుంచి రూ.5కే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చంద్రబాబు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి మరో కొత్త పథకం ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి తెలిపారు. రూ. 5కే పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కూడా అధ్యయనం చేశామన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
1200 ఎలక్ట్రిక్ బస్సులు...
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో ఆర్టీసీని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 200 వరకు కొత్త బస్సులు రోడ్డెక్కాయన్నారు. వచ్చే మూడు నెలల్లో మరో 1200 కొత్త బస్సులు రోడ్డెక్కేలా ఆర్డర్లు పెట్టామని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు చంద్రబాబు పెట్టిన అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసేలా జగన్ హయాంలో డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో బస్సులను ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతో జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్ధరిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.