Asianet News TeluguAsianet News Telugu

వారెంట్ బీజేపీ కుట్ర అంటున్న చంద్రబాబు

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా బాబ్లీ పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. 

chandrababu fires on bjp
Author
Amaravathi, First Published Sep 17, 2018, 6:18 PM IST

అమరావతి: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా బాబ్లీ పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్సారెస్పీలో మరో ప్రాజెక్టు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశానని గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని ప్రజలపక్షాన పోరాటం చేశానని చెప్పారు. 

బాబ్లీ వద్ద ఆందోళన సమయంలో పోలీసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. రెండు రోజులు తమను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక విమానంలో పంపించేశారని తెలిపారు. తమపై ఎలాంటి కేసులు లేవన్న అప్పటి ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 

ఈ నోటీసులు కావాలనే కుట్రపూరితంగా పంపించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదా, కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం బీజేపీ కాదా అని బీజేపీ ఎమ్మెల్యేలను నిలదీశారు. 

 మరోవైపు నాన్ బెయిలబుల్ వారెంట్లు పంపించి తాము డ్రామాలు ఆడుతున్నామని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు ఖండించారు. తాము డ్రామాలు ఆడుతున్నామని బీజేపీ నేతలు విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నామని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం తమకు లేదని చంద్రబాబు తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ పై చర్చించామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios