నెల్లూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికలో జోరు పెంచారు. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు. 

ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేశారు. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 

నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వెయ్యాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని అందులో భాగంగా నెల్లూరు రూరల్ నుంచి తనను ఎంపిక చేశారని తెలిపారు. మెుదట తాను ఎంపీగా పోటీ చెయ్యాలని భావించానని అయితే సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పంపాలని ఆలోచిస్తున్నారని ఆయన ఆలోచనల మేరకు పనిచేస్తానని తెలిపారు. 


తనకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే కొవ్వూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించానని అయితే చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా రూట్ క్లియర్ చేశారని తెలిపారు. 

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గా తాను నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నానని అందరిని కలుపుకుపోతానని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీని చూసి టీడీపీ భయపడుతోందని ప్రచారం చేసుకుంటున్నారని తాము ఏంటో తమ బలం ఏంటో త్వరలో చూపిస్తానని సవాల్ విసిరారు.