ఫిరాయింపులతో చంద్రబాబుకు తలనొప్పులు

ఫిరాయింపులతో చంద్రబాబుకు తలనొప్పులు

ఏ ముహూర్తాన ఫిరాయింపులను మొదలుపెట్టారో అప్పటి నుండి చంద్రబాబునాయుడుకు ఒకటే తలనొప్పి. ఇటు పార్టీలోనే కాకుండా బయట నుండి కూడా తలనొప్పులే. తాజాగా స్పీకర్ కు కోర్టు నోటీసుల దాకా వచ్చింది వ్యవహారం.

వైసిపిని నిర్వీర్యం చేయటం ద్వారా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని గట్టి దెబ్బ కొడదామని చంద్రబాబు అనుకున్నారు. అయితే, ఫిరాయింపులు మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతీ అంశమూ చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది.

ఫిరాయింపుల వల్ల పార్టీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఫిరాయింపు ఎంఎల్ఏలను టిడిపిలోని సీనియర్ నేతలు కలుపుకుని వెళ్ళటం లేదు. ఫలితంగా ఫిరాయింపుల నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపి నేతలకు ప్రతీరోజూ ఘర్షణలే.

అద్దంకి, కోడుమూరు, నంద్యాల, ఆళ్ళగడ్డ, కదిరి, గిద్దలూరు, బద్వేలు, జమ్మలమడుగు లాంటి నియోజకవర్గాల్లో జరుగుతున్న గొడవలే అందుకు సాక్ష్యాలు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టమే.

వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాలు పెరుగుతాయన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. అయితే, నియోజకవర్గాలు పెరగటం లేదన్న విషయం తేలిపోయింది. దాంతో టిక్కెట్ల కోసం ఫిరాయింపులకు టిడిపి సీనియర్లకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి.

ఫిరాయింపుల్లో చంద్రబాబు ఎంతమందికి టిక్కెట్లిచ్చేది అనుమానమే. ఒకవేళ టిక్కెట్లు రాకపోతే వారేం చేస్తారో అన్న ఆందోళన టిడిపిలో మొదలైంది.

ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చాలంటూ ఎంతమంది కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. అయితే, తాజాగా వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన కేసులో కోర్టు ఏకంగా స్పీకర్ కే నోటీసులు జారీ చేసింది.

మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర కోడెల శివప్రసాద్ ను ఆదేశించటంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos