తనపై అలిపిరిలో జరిగిన దాడికి గల కారణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ ఎస్సైలకు చెప్పారు. 

అమరావతి: తనపై అలిపిరిలో జరిగిన దాడికి గల కారణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ ఎస్సైలకు చెప్పారు. 2017 బ్యాచ్‌ ట్రైనీ ఎస్‌ఐలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ముఖాముఖి నిర్వహించారు. 

అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షన్‌ ఉండేదని, హైదరాబాద్‌లో వీధికో రౌడీ ఉండేవాడని, నక్సలిజం హైదరాబాద్‌ వరకు విస్తరించిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ అరికట్టామని ఆయన చెప్పారు. 

దాని వల్లనే తనపై అలిపిరిలో దాడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. తప్పు చేస్తే దొరికిపోతామనే భయం ఉంటే నేరాలు జరగవని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు పెట్టబోతున్నామని తెలిపారు. 

టెక్నాలజీ వినియోగిస్తే పోలీసింగ్‌ సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మాలకొండయ్య, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.