తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడంపై టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు ప్రెస్మీట్లు పెట్టి మరీ చంద్రబాబును తిట్టని తిట్లు లేకుండా తిట్టేశారు. 

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో స్వీట్లు పంచుతూ ఎంజాయ్ చేసిన మోత్కుపల్లి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కు చెల్లించుకున్నారు. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోత్కుపల్లి నర్సింహులు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోవాలని మెుక్కుకున్నట్లు ప్రకటించారు. 

మోత్కుపల్లి కోరుకున్నట్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వామి వారి మెుక్కులు తీర్చుకున్నారు మోత్కుపల్లి. 

ఇకపోతే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలంటూ జగన్ కు పట్టంకట్టాలంటూ పిలుపునిచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబు ఓటమే తన పంతం అంటూ పదేపదే చెప్పిన మోత్కుపల్లి మే 23న ఏపీ ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా తిలకించారు. 

తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆయన ఎంజాయ్ చేశారు. అభిమానులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఏపీకి చంద్రబాబులాంటి దుర్మార్గుడి పీడ వదిలిందంటూ ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు సైతం అర్పించారు. 

చంద్రబాబు నాయుడు ఘోరపరాజయంతో దివంగత సీఎం ఎన్టీఆర్‌ ఘోష నెరవేరిందని స్పష్టం చేశారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్‌ ప్రాణాలు వదిలారని, ఆయన ప్రాణాలు తీయటమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్‌ కూడా లాక్కున్నారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందరినీ మోసం చేసి ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఎలా చిత్తు చిత్తుగా ఓడారని ప్రశ్నించారు. 

వైఎస్‌ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయిందన్నారు. ఏమాత్రం మనస్సాక్షి ఉన్న చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్‌ కుటుంబానికి అప్పగించాలన్నారు. ఇకపోతే మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగారు. అయితే పార్టీలో ఉంటూ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబు.