సచివాలయంలో చంద్రబాబు సైకిల్ తొక్కారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సైకిల్ తొక్కారు. నిత్యం బ్లాక్ క్యాట్ భద్రతా సిబ్బంది ఉండే చంద్రబాబు సైకిల్ తొక్కటమేంటి? అని అనుంటున్నారా? నిజమేనండి అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు సైకిల్ తొక్కారు. సచివాలయం 2వ బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారు. విషయం ఏమిటంటే, సచివాలయంలో పొద్దున స్మార్ట్ సైకిళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎటూ సైకిళ్ళను ప్రారంభించారు కదా? అందుకనే సరదాగా ఉంటుందని తాను కూడా ఓ సైకిల్ తీసుకుని తొక్కుకుంటూ వెళ్ళారు.
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను తొలిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టారు. జర్మనీ నుంచి ఇప్పటికే సచివాలయానికి 30 సైకిళ్లు చేరాయి. వెలగపూడి సచివాలయంలో ప్రయోగాత్మకంగా వీటిని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు. సచివాలయం ఆవరణ లోపల రెండు స్మార్ట్ సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
అలాగే వాహనాల పార్కింగ్ వద్ద మరో స్టేషన్ ఏర్పాటుచేశారు. ప్రతి స్టేషన్ లో 10 సైకిళ్ళను అందుబాటులో ఉంచారు. సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా స్వైపింగ్ కార్డు, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. ఈ పాస్‌వర్డ్ కొడితేనే సైకిళ్ళకున్నలాక్ ఓపెన్ అవుతుంది. సచివాలయం లోపల, బయట సందర్శకుల అవసరార్ధం సైకిళ్లు ఉంటాయి. అయితే, పని ముగించుకున్న తర్వాత తీసుకున్న సైకిల్‌ను మూడు స్టేషన్లలో ఎక్కడైనా అప్పజెప్పచ్చు లేండి. ఎల్లాయిడ్, అల్యూమినియంతో తయారైన మూడు గేర్ల కొత్త సైకిళ్లు వర్షంలో తడిసినా తుప్పు బట్టవు.
