అమరావతి: మీ తండ్రి కూడ పార్టీ మారారు...రెడ్డి కాంగ్రెస్ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని శ్రీరామమూర్తి తీవ్రంగా విమర్శించారని ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబునాయుడు కామెంట్స్ చేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. గురువారం నాడు అసెంబ్లీలో స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అభినందించే క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం  సాగింది.

 ఇవాళ సీఎం జగన్‌తో పాటు విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు ప్రతిపక్షాన్ని కించపర్చేలా ఉందని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.  మీది కూడ రాజకీయ కుటుంబం, మీ తండ్రి 1978లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెడ్డి కాంగ్రెస్ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ఆర్‌ను శ్రీరామమూర్తి అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పించారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేయగానే  వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా చంద్రబాబునాయుడు ప్రసంగానికి అడ్డుతగిలారు. అయినా చంద్రబాబు ప్రసంగించారు. చరిత్రలో జరిగిన విషయాన్నే తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు.చరిత్రను ఎవరూ కూడ మార్చలేరన్నారు. తాను ఎవరిని కూడ కించపర్చాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. 

ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ లేచి చంద్రబాబుకు కౌంటరిచ్చారు. గత ఐదేళ్లలో చట్టాన్ని పరిరక్షించకుండా చట్టానికి తూట్లు పొడిచారని గుర్తు చేశారు. తమపార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి... తాను చేసిన పనిని సమర్ధించుకొనేవాదనను చంద్రబాబు చేస్తున్నారని జగన్ చెప్పారు. చంద్రబాబు గురించి ఆయనకు పిల్లనిచ్చిన మామ మాట్లాడిన మాటలను స్పీకర్ అవకాశమిస్తే టీవీలో చూపించేందుకు తాను సిద్దంగా ఉన్నానని సీఎం చెప్పారు.