అనంతపురం: రాబోయే ఎన్నికల్లో వారసులను బరిలోకి దింపాలని జేసీ ఫ్యామిలీ తెగ ఆరాట పడుతోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన జేసీ బ్రదర్స్ తమ పుత్రుల రాజకీయ భవిష్యత్ కు పావులు కదుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ అలసిపోయామని వయసు కూడా పైబడుతుండటంతో వారు తమ వారసులను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. 

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి తాను పోటీ చెయ్యబోనని తన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డిని బరిలోకి దింపనున్నట్లు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. అయితే తమ్ముడి బాటలోనే పయనించేందుకు అన్న జేసీ దివాకర్ రెడ్డి సైతం రెడీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే పలు వేదికల సాక్షిగా జేసీ దివాకర్ రెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. కర్నూలు జిల్లాలో ధర్మపోరాట దీక్ష సభలో కూడా ఇలానే మాట్లాడారు. చంద్రబాబు చేతికి ఎముక లేదంటూ పొగడ్తల వర్షం గుప్పించారు. 

అయితే తాను మంత్రి పదవుల కోసం పొగడటం లేదని వచ్చే ఎన్నికల్లో తాను అసలు పోటీ చెయ్యనంటూ ప్రకటించారు. అయితే జేసీ సీమటపాకాయ్ లా ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా అందులో ఇదొకటి అనుకున్నారు అంతా. ఆ ప్రకటనను అంత సీరియస్ గా తీసుకోలేదు. 

అయితే నిజంగానే జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో అనంతపురం లోక్ సభ నుంచి ఆయన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలో దించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు జేసీ. అనంతపురం లోక్ సభ పరిధిలో అభ్యర్థులను నెమ్మదిగా తనవైపుకు తిప్పుకుంటున్నారు కూడా. 

అయితే జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నాలు రాను రాను రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును అమరావతిలో కలిశారు. తన మనసులో మాట బయటపెట్టారు. 

వచ్చే ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్‌ స్థానం నుంచి తన కుమారుడు జేసీ పవన్ కుమార్‌ రెడ్డిని బరిలో దింపాలనుకుంటున్నానని తమరి అనుమతి కావాలని కోరారు. అందుకు చంద్రబాబు నాయుడు నుంచి ఊహించని స్పందన వచ్చిందట. దీంతో జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా ఖంగుతిన్నారట.ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎంపీ అభ్యర్థిగా పవన్ కుమార్ రెడ్డిని బరిలో నిలపాలంటే ఓ కండీషన్ పెట్టారట. 

వాస్తవానికి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో తన కుమారుడిని బరిలోకి దింపాలని జేసీ దివాకర్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదు అనుకున్నట్లు తాను తెరచాటు వెనుక చేస్తున్న రాజకీయ ప్రణాళికలు ఎవరికి తెలియదనుకున్నారు. కానీ అంతా బహిర్గతమైపోయింది. 

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు గెలవాలంటే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించాలని భావించిన జేసీ అందుకు తగ్గ ప్లాన్ వేశారు. తన అనూయులకు టిక్కెట్లు ఇప్పించుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి సిట్టింగ్ లకు ఎసరు పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. 

అందులో భాగంగానే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని పదేపదే కామెంట్లు చేసేవారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని శింగనమల, రాయదుర్గం, అనంతపురం అర్బన్‌, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. 

అయితే ఇటీవలే అనంతపురంలో టీడీపీ నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు జిల్లా రాజకీయాలపై ఆరా తీశారట. జేసీ ప్లాన్ లను సిట్టింగ్ ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద మెురపెట్టుకోవడంతో అసలు గుట్టు రట్టైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు జేసీ ప్లాన్ లకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబుకు భలే లక్కీగా జేసీ వచ్చి ఇరుక్కుపోయారు. అమరావతిలో చంద్రబాబును కలిసి తన కుమారుడి విషయం చెప్పారు. దీంతో స్పందించిన చంద్రబాబు మీ కుమారుడికి లోక్ సభ టిక్కెట్ కావాలంటే ముందు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి వారికి అభ్యంతరం లేనట్లు లేఖలు తీసుకురావాలని కండీషన్ పెట్టారు. 

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదు, వారందరినీ మార్చాలని తాను ముందు నుంచీ చెబుతున్నానని ఇప్పుడు వారి నుంచే లేఖలు ఎలా తీసుకువస్తానని జేసీ చంద్రబాబ నాయుడుకు చెప్పుకొచ్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచే పరిస్థితి లేనప్పుడు మరి ఏ రాజకీయ అనుభవం లేని మీ కుమారుడు ఎంపీగా ఎలా గెలుస్తారని చంద్రబాబు జేసీని నిలదీశారు. 

జేసీ పవన్‌కు అనంతపురం ఎంపీ టికెట్‌ ఇస్తే తన కుమారుడికి హిందూపురం టికెట్‌ ఇవ్వాలంటూ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు ఎంపీ జేసీతో చెప్పారు.  తాడిపత్రి టికెట్‌ మాత్రం మిమ్మల్ని కాదని ఎవరికీ ఇవ్వబోనని అక్కడ మీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారట.

అసలే లేఖలు కండీషన్ తో ఉక్కిరి బిక్కిరి అయిన జేసీ దివాకర్ రెడ్డికి  జేసీ పవన్‌కు టికెట్ ఇస్తే ఇతరులు కూడా ఇదే తరహాలో వారసులకు టికెట్లు డిమాండ్ చేస్తారని చంద్రబాబు చెప్పడంతో ఏం చెయ్యాలో దిక్కు తోచలేదట. దీంతో చేసేది లేక చంద్రబాబుకు ఓ దండం పెట్టేసి సీఎం చాంబర్‌ నుంచి బయటకు వచ్చేశారు జేసీ.
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుపై పొగడ్తలు, జగన్ కి చురకలు అంటించి జేసీ

మళ్లీ నోరు జారిన జేసీ, రోషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారంటూ చురకలు