అమరావతి: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చర్చ జరిగింది. హైదరాబాదులోని విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తొలగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడదు గుర్తు చేశారు. 

తిరుపతి ధర్మపోరాట సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు మంత్రులు అభిప్రాయపడ్డారు. రాజకీయాంశాలపై చురుగ్గా స్పందించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులకు సూచించారు. 

జూన్ మొదటి వారంలో నెల్లూరులో దళితతేజం సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో ఈ నెల 14వ తేదీన మైనారిటీ సదస్సు, ఆ తర్వాత గిరిజన సంక్షేమంపై బహిరంగ సభ నిర్వహిస్తారు. సైకిల్ యాత్రలు మరింత చురుగ్గా చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

సమావేశం నిర్ణయాలను ఎపి టీడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు జనవరి వరకు కొనసాగుతాయని చెప్పారు. అమరావతిలో చివరి సభ జరుగుతుందని చెప్పారు.