టెక్నాలజీ పెరిగాక నగదు వాడొద్దు రూ.2 వేల నోటుపై చర్చ జరగాలి పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు తాత్కాలికమే సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య

టెక్నాలజీ పెరిగాక అసలు నోట్లే అవసరం లేదని, నగదు రహితంగా దేశంలో పనులన్నీ జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, అయితే రూ. 2 వేల నోట్లు తీసుకరావడం సరికాదని అభిప్రాయపడ్డారు.

‘రెండు వేల నోట్లు రావు.. ఒకవేళ వచ్చినా పరిమితంగా రావొచ్చు.. దానిపై మరింత చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చునని అయితే, రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు. మొదట్నుంచీ పెద్ద నోట్ల రద్దుకే పోరాడుతున్నానని తెలిపారు.



‘దేశానికి ఏది కావాలో ప్రభుత్వాలు అదే చేయాలి. నోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఎదురైనా దీర్ఘకాలంలో లాభం జరుగుతుంది. ఇప్పటికే సింగపూర్, కెనడా, యూరప్ లోని పలు దేశాల్లోనూ కరెన్సీ నోట్లు రద్దుచేసిన సందర్భాలున్నాయి. తద్వారా ఆయా దేశాలు మంచి ఫలితాలు సాధించాయి. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో నల్ల ధనం పేట్రేగిపోతోంది. అసలు ప్రపంచమంతా ఈ విధానాన్ని అమలుచేయాలి’ అని బాబు వ్యాఖ్యానించారు.