శుక్రవారం జరిగిన టిడిపి ఎంపిల సమన్వయ సమావేశంలో చంద్రబాబునాయుడు కేంద్రంపై నిప్పులు చెరిగారా? అవుననే లీకులు వస్తున్నాయి. ప్రత్యేకహోదాపై మాట్లాడుతూ, వేరే రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తే ఏపికీ అదేపేరుతో ఇవ్వాలన్నారు. వైసిపి గురించి మాట్లాడుతూ, హోదా తప్ప మిగిలిన 18అంశాలను వైఎస్సార్ కాంగ్రెస్ వదిలేస్తోందని మండిపడ్డారు. హోదా ఒక్కటే చాలదని దానితోపాటు చట్టంలో మిగిలిన అన్నీ కూడా చేయాలని డిమాండ్ చేశారు.

 రైల్వే జోన్, కడప స్టీల్, ఆర్ధికలోటు, రాజధాని వంటివి వదిలేసి హోదా ఒక్కటే అడగడం కరెక్ట్ కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడం( 1984లోనా లేకపోతే 1994లోనా అన్నది చెప్పలేదు) టిడిపి నాయకత్వమార్పిడి, రాష్ట్ర విభజన, ఇప్పుడు ఈ సంక్షోభం ఎదుర్కొంటోందట.

బిజెపి రాయలసీమ డిక్లరేషన్ పై కూడా చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రాన్ని నిధులు అడగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టటమేంటన్నది చంద్రబాబు లాజిక్. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో సంప్రదింపులలో అలక్ష్యం చేయలేదని, నిన్న కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రజా ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

రాష్ట్రానికి హోదా ఇచ్చి ఇంకేమీ ఇవ్వకపోతే రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు గౌరవించాలని వారు అడిగేది ఇవ్వల్సిన బాద్యత కేంద్రంపై ఉందన్నారు. తాను పుట్టుకతోనే రాజకీయ నాయకుడినన్నారు. పనిలో పనిగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపైన కూడా మండిపడ్డారు. ఆర్ధికలోటు భర్తీకి ఫార్ములా ఇచ్చామన్న కేంద్రం వాదనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం ఫార్ములా ఇచ్చారు ? వాళ్లిచ్చిన ఫార్ములా ఏమిటి’ ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ కు విశ్వసనీయత లేదని నాటకాలు ఆడుతోందనేది ప్రజల్లోకి వెళ్లిందట. అదే సమయంలో టిడిపి చిత్తశుద్దితో పోరాడుతోందనే సానుభూతి ప్రజల్లో ఉందట.  విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు బలహీన పడ్డాయని చెప్పిన చంద్రబాబు  42ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి లబ్ధి చేకూర్చిన విషయాన్ని గుర్తు చేశారు.